Elon Musk Postpones India Trip: ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాకు యజమాని, ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన ఎలాన్‌ మస్క్ భారత్‌కు రావడం లేదు. ఈ పారిశ్రామికవేత్త భారత పర్యటన వాయిదా పడింది. గత ప్లాన్‌ ప్రకారం, ఈ నెల 21 - 22 తేదీల్లో ఎలాన్‌ మస్క్‌ భారతదేశాన్ని సందర్శించాల్సి ఉంది. అతను మన దేశానికి రావడం ఇదే తొలిసారి. అయితే, ఇండియా టూర్‌ను అతను వాయిదా వేశారు. ఈ విషయాన్ని మస్క్ స్వయంగా ధృవీకరించారు. భారత పర్యటనను ఎందుకు వాయిదా వేయడం వెనకున్న కారణాన్ని కూడా మస్క్‌ వివరించారు.


భారతదేశ పర్యటన వాయిదా గురించి తన అధికారిక X హ్యాండిల్‌లో వెల్లడించిన ఎలాన్‌ మస్క్‌.. టెస్లా మేనేజ్‌మెంట్‌లో కొన్ని పెద్ద బాధ్యతల కారణంగా ప్రస్తుతానికి తన భారత పర్యటనను వాయిదా వేసుకున్నట్లు పోస్ట్ చేశారు. ఈ ఏడాది చివరి నాటికి భారత్‌కు వచ్చేందుకు చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తుంటానని కూడా రాశారు.


టూర్‌ ట్రిప్‌ వాయిదాకు ఇదీ కారణం
వాస్తవానికి, ఈ నెల 23న అమెరికాలో జరిగే టెస్లా పెట్టుబడిదార్ల మీటింగ్‌కు మస్క్‌ హాజరు కావాలి. టెస్లా ఇటీవలే త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఇటీవలి నెలల్లో కంపెనీ అమ్మకాలు క్షీణించాయి. ఈ నేపథ్యంలో కంపెనీ ఇన్వెస్టర్లు, షేర్ హోల్డర్లు ఆందోళనకు గురవుతున్నారు. వాళ్ల ప్రశ్నలకు సమాధానాలు చెప్పి, టెన్షన్‌ తగ్గించాలని మస్క్‌ భావించారు. ఏప్రిల్ 21-22 తేదీల్లో మస్క్ భారతదేశంలో ఉంటే, ఏప్రిల్ 23న ఇన్వెస్టర్ల కాల్‌కు హాజరు కావడం అతనికి కష్టమవుతుంది. కాబట్టి, ఇండియా టూర్‌ను మస్క్‌ వాయిదా వేశారు.


ఒకవేళ ఎలాన్‌ మస్క్‌ భారతదేశానికి వస్తే.. మన దేశంలో టెస్లా తయారీ కేంద్రం, శాటిలైట్ కమ్యూనికేషన్ వంటి కొన్ని ప్రణాళికలను ప్రకటించే అవకాశం ఉంది. భారత్‌లో 25,000 కోట్ల రూపాయల పెట్టుబడిని మస్క్‌ ప్రకటించే ఛాన్స్‌ ఉందని మీడియా రిపోర్ట్స్‌ చెబుతున్నాయి.


ఇండియా వస్తానని ఏప్రిల్ 10న ట్వీట్‌
ఈ నెల 10వ తేదీన ఎలాన్‌ మస్క్ ఒక ట్వీట్‌ చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీని త్వరలో కలవడానికి చాలా సంతోషిస్తున్నట్లు ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. మస్క్ భారతదేశ పర్యటన ప్రకటనకు కొన్ని రోజుల ముందు, భారత ప్రభుత్వం కొత్త EV విధానాన్ని రూపొందించింది. ఈ విధానం వల్ల, విదేశీ కంపెనీలు మన దేశంలో ఈవీ ప్లాంట్లను ఏర్పాటు చేయడం సులభం అవుతుంది. కొత్త EV విధానం ప్రకారం, భారత్‌లో 500 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టే విదేశీ కంపెనీలకు దిగుమతి సుంకంలో మినహాయింపు దక్కుతుంది.


టెస్లా కార్లను మన దేశ రోడ్లపై పరుగులు పెట్టించడంతో పాటు స్టార్‌లింక్‌ లాంచ్‌ కోసం కూడా ఎలాన్‌ మస్క్ చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్‌ ప్రకారం, మూడో త్రైమాసికం నాటికి భారత్‌లో స్టార్‌లింక్‌ కార్యకలాపాలు ప్రారంభించాలన్నది ప్లాన్‌. ఈ ఏడాది ఫిబ్రవరిలో, అంతరిక్ష రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం FDIని ఆమోదించింది. అప్పటి నుంచి భారతదేశంలో స్పేస్‌ఎక్స్‌ (SpaceX) ప్రవేశానికి సంబంధించిన ఊహాగానాలు పెరిగాయి.


మరో ఆసక్తికర కథనం: ఓలాకు హలో చెబుదామా? - త్వరలో ఐపీవో మార్కెట్‌లోకి ఎంట్రీ