Israel Iran Conflict: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు (Middle East) కొనసాగుతూనే ఉన్నాయి. ఇజ్రాయేల్, ఇరాన్ మధ్య యుద్ధంతో మొదలైన ఈ అగ్గి చల్లారడం లేదు. ఉన్నట్టుండి ఇరాక్‌లోనూ అలజడి (Israel Iran War) మొదలైంది. ఇరాన్‌ మద్దతునిస్తున్న ఇరాక్‌ మిలిటరీ బేస్‌లపై దాడులు జరిగాయి. దాదాపు మూడు చోట్ల బాంబుల వర్షం కురిసింది. ఫలితంగా ఇజ్రాయేల్, ఇరాన్‌ మధ్య ఘర్షణ మరింత పెరిగింది. ఈ దాడులు ఎవరు చేశారన్నది ఇంకా తేలకపోయినప్పటికీ కచ్చితంగా ఇజ్రాయేల్ పనేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే...ఈ దాడుల వెనక అమెరికా హస్తం ఉందన్న ఆరోపణల్ని అగ్రరాజ్యం కొట్టి పారేసింది. ఈ దాడుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా...8 మంది తీవ్రంగా గాయపడినట్టు CNN వెల్లడించింది. అమెరికాతో పాటు ఇజ్రాయేల్ కూడా ఈ దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. అటు ఇరాన్ మాత్రం ఈ దాడులపై తీవ్రంగా స్పందించింది. అనవసరంగా రెచ్చగొడితే ఇజ్రాయేల్‌పై పూర్తి స్థాయిలో దాడులు చేసేందుకు వెనకాడమని తేల్చి చెప్పింది. ఇరాక్‌లోని ఇస్ఫహాన్‌ ప్రావిన్స్‌లో ఎయిర్‌పోర్ట్‌కి సమీపంలో ఈ దాడులు జరగడం అక్కడ కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన ఇరాన్ రక్షణ శాఖ పెద్ద ఎత్తున సైనికులను మొహరించింది. ఇప్పటికే ఇజ్రాయేల్, హమాస్ మధ్య కొద్ది నెలలుగా యుద్ధం జరుగుతూనే ఉంది. మధ్యలో ఇరాన్‌ కూడా రావడం వల్ల మధ్యప్రాచ్యంలో అనిశ్చితి నెలకొంది. మొదటి నుంచి ఇజ్రాయేల్‌కి మద్దతునిస్తున్న అమెరికా ఈ దాడులపై కీలక ప్రకటన చేసింది. 


"ఇరాక్‌లో జరిగిన దాడులు అమెరికానే చేసిందని కొన్ని చోట్ల రిపోర్ట్‌లు వస్తున్నాయి. కొందరు మాపై ఆరోపణలు చేస్తున్నారు. ఆ ప్రచారమంతా అవాస్తవమే. ఆ దాడులకు అమెరికాకి ఎలాంటి సంబంధం లేదు"


- అమెరికా






గత నెలలో మొదలైందీ యుద్ధం. సిరియాలోని ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయేల్ దాడి చేసింది. ఆ దాడిలో ఇరాన్‌కి చెందిన 11 మంది కీలక మిలిటరీ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్‌ ఇజ్రాయేల్‌పై డ్రోన్‌లతో అటాక్ చేసింది. మిజైల్స్‌తో దాడులు చేసింది. ఇలా ఒకరిపై ఒకరు ప్రతీకార దాడులు చేసుకోవడం వల్ల మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఇటు భారత్ కూడా ఈ యుద్ధంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇజ్రాయేల్‌లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే వాళ్ల కోసం ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ నంబర్‌ని కేటాయించింది. ఎలాంటి అవసరం ఉన్నా సంప్రదించాలని వెల్లడించింది. రెండు దేశాలూ సంయమనం పాటించాలని కోరింది. పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారకముందే చర్చలు జరపాలని తెలిపింది. అటు ఇరాన్ మాత్రం దాడులు ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెబుతోంది. ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. 


Also Read: Viral Video: ఇండియన్స్‌పై బంగ్లాదేశ్ టూరిస్ట్‌ల రాళ్లదాడి, భారత్-బంగ్లా సరిహద్దులో అలజడి