Bangladeshi Tourists Pelt Stones: భారత్, బంగ్లాదేశ్ సరిహద్దు (India Bangladesh Border) ప్రాంతంలో ఉన్నట్టుండి అలజడి రేగింది.  Jaflong సరిహద్దు వద్ద బంగ్లాదేశ్ విజిటర్స్‌ ఇండియన్ టూరిస్ట్‌లపై (Jaflong Border) రాళ్లు విసిరారు. నదిలోకి దిగి సేద తీరుతుండగా ఉన్నట్టుండి ఆ వైపు నుంచి కొందరి బంగ్లాదేశ్‌ టూరిస్ట్‌లు ఇండియన్స్‌పై రాళ్లు రువ్వడం మొదలు పెట్టారు. దీంతో ఒక్కసారిగా భారతీయులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ జఫ్లాంగ్‌ సరిహద్దు ప్రాంతం అటు బంగ్లాదేశ్ వాళ్లకి ఇటు భారతీయులకు మంచి టూరిస్ట్ స్పాట్. నిత్యం అక్కడ పర్యాటకుల రద్దీ కనిపిస్తూనే ఉంటుంది. పైగా ఇక్కడికి రావాలంటే వీసా కూడా అక్కర్లేదు. అందుకే రెండు దేశాల వాళ్లు ఇక్కడికి వచ్చి సేదతీరుతుంటారు.


అంతా నీళ్లలో ఆడుతున్న సమయంలో ఇలా రాళ్ల దాడి జరగడం స్థానికంగా కలకలం రేపింది. ఇండియన్ టూరిస్ట్‌లపై బంగ్లాదేశ్ టూరిస్ట్‌లు రాళ్లు విసరడం ఈ వీడియోలో చాలా స్పష్టంగా కనిపిచింది. అయితే...ఈ దాడికి కారణమేంటన్నది మాత్రం తెలియలేదు. ఈ ఘటనతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మొదలయ్యే ప్రమాదముంది. సోషల్ మీడియా యూజర్స్‌ ఈ దాడిపై మండి పడుతున్నారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ ఘటనపై స్పందించాలని, దాడి చేసిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.