Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో శనివారం నాటి సభలో కాసేపు సరదా పరిణామాలు చోటు చేసుకున్నాయి. కార్మిక మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) మరోసారి తనదైన శైలి మాటలతో సభలోని సభ్యులందర్నీ కడుపుబ్బా నవ్వించారు. కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR) పై చేసిన వ్యాఖ్యలతో మంత్రి కేటీఆర్ కూడా పగలబడి నవ్వారు. కేసీఆర్‌ అపర భగీరథుడని పొగిడారు. థర్డ్ ఫ్రంట్‌కు అడుగుపడిందని, తగ్గేదే లే.. అంటూ బీజేపీ నేతలపై తనదైన శైలిలో పంచ్‌లు వేశారు.


‘కేంద్రంల రామా.. చంద్రా అనాలె’
తాము ట్రెండ్‌ ఫాలో అవ్వమని.. ట్రెండ్‌ సెట్‌ చేస్తామంటూ మల్లారెడ్డి (CH Mallareddy) సినిమా డైలాగ్‌లు వదిలారు. జవహర్‌ నగర్‌లో చెత్త నుంచి కరెంటు తయారు చేస్తున్నారని అన్నారు. ‘‘తెలంగాణ జాతి పిత మన కేసీఆర్. బక్కపలుచటి వ్యక్తి అని, ప్రాంతీయ పార్టీలతో కలుస్తున్నడని బీజేపీ వాళ్లు అనుకుంటున్నరు. నేనొక చిన్న సుమతి శతకం చెప్త అధ్యక్షా.. బలవంతమైన సర్పం చలి చీమల చేతికి చిక్కి చావదే సుమతీ. ఇది కరెక్టుగా బీజేపోల్లకి సూటైతది అధ్యక్షా. కానీ వాళ్లు చెట్టుకే నిప్పు పెట్టాలని చూస్తున్నరు. కానీ కేసీఆర్ సర్ ఫైర్ అయిండనుకో మసైపోతరధ్యక్షా! ఆల్రెడీ అడుగు పడింది అధ్యక్షా, వెనక్కి చూసేదే లేదు. అందుకు తగ్గేదే లేదు అధ్యక్షా. ఈస్ట్ లేదు.. వెస్ట్ లేదు.. నార్త్ లేదు సౌత్ లేదు.. అన్నిట్నీ సమంగా చూసి రామరాజ్యం మళ్లీ తెస్తాడు. అక్కడ చంద్రుడు, ఇక్కడ తారక రాముడు.. ఉంటే ఇంకేం కావాలి అధ్యక్షా మనకు. బంగారు భారత్ అవుతుంది. చరిత్రలోనే మర్చిపోలేము. ఢిల్లీ పెద్దలు ఇక నుంచి రామా.. చంద్రా అనాలి అధ్యక్షా!!’’


‘‘ప్రియతమ నేత, కార్మిక పక్షపాతి మన కేసీఆర్ సర్ ఆదేశానుసారం సబ్సిడీపై లక్ష మోటారు సైకిళ్లు ఇప్పిస్తం అధ్యక్షా. మా భవన కార్మికులు మోటారు సైకిళ్లపైన డుర్రు.. డుర్రు.. అని తిరగాలె అధ్యక్షా. అన్నా.. భట్టి అన్నా ఇటు ఇను అన్నా.. మే 1 నాడు లక్ష మోటారు సైకిళ్లు ఇస్తున్నం. నీకు ఎక్స్‌ట్రా కావాల్నంటే నేను సపరేట్‌గా ఇస్తా. కాంగ్రెస్, బీజేపీ అన్నదమ్ముల లెక్క’’


భట్టి విక్రమార్కను (Bhatti Vikramarka) ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘ప్రతిపక్ష నాయకుడవు నువ్వు రోజూ ఖమ్మం.. ఖమ్మం (Khammam).. మధిర.. మధిర (Madhira) అంటున్నవు. నువ్వు ఒక్కసారి తెలంగాణ మొత్తం తిరగాలె అన్నా నువ్వు. లేబర్ మినిస్టర్ అంటే వీళ్లంతా తక్కువ అంచనా వేస్తరు. నా శాఖలో రూ.1500 కోట్లు ఎఫ్‌డీలు ఉంటయ్. తక్కువ అంచనా వేయొద్దు. కేటీఆర్‌ది టీఎస్​ ఐపాస్.. నాది ఫ్యాక్టరీ ఐ పాస్. ఎప్పుడూ ప్రశ్నలు కేటీఆర్, హరీశ్ రావులనే అడుగుతరా. నన్ను అడగరా’’ అని నవ్వులు పూయించారు.