యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో దిల్లీలోని నాయకులు ఒకలా... గల్లీలోని నాయకులు మరోలా మాట్లాడుతున్నారని విమర్శించారు కేటీఆర్. తెలంగాణభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గతేడాది యాసంగి పంట టైంలో సీఎం, మంత్రులు పలుమార్లు దిల్లీ వెళ్లిన కలిశారని.. ఏటా కొనుగోలు చేసిన మాట నిజమే కానీ.. ఇకపై పారాబాయిల్డ్ రైస్ కొనబోమని చెప్పినట్టు వివరించారు కేటీఆర్. లక్షల మంది వ్యవసాయంపై ఆధార పడి జీవిస్తున్నారని వాళ్ల పొట్టకొట్టేలా బాయిల్డ్, రా రైస్ అంటూ రూల్స్ పెట్టొద్దని రిక్వస్ట్ చేసినట్ట్టు తెలిపారు. ఎలాంటి గందరగోళానికి తావులేకుండా గతంలో ఉన్న రూల్స్ ప్రకారం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. 


ఎన్నిసార్లు ఎలాంటి విజ్ఞప్తులు చేసినా కేంద్రం తీరులో మార్పు రాలేదన్నారు కేటీఆర్. ఇది అర్థం చేసుకునే ప్రభుత్వం కాదని.. కేవలం కార్పొరేట్లకు మాత్రమే ఈ ప్రభుత్వం పని చేస్తుందని సీరియస్ కామెంట్స్ చేశారు. కేంద్రం వైఖరి గమనించి రైతులు వరి వేయొద్దని మంత్రి నిరంజన్ రెడ్డి అప్పట్లో ప్రకటిస్తే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ రైతులను రెచ్చగొట్టేలా మాట్లాడారని ఆరోపించారు. సీఎం మాటలు పట్టించుకోవద్దు రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేయించే బాధ్యత తమదీ అంటూ హామీ ఇచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు. ఎలాంటి రైస్‌ అయినా కేంద్రం కొంటుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా మాట ఇచ్చినట్టు తెలిపారు. 


రాష్ట్రంలోని బీజేపీ నేతలు ఒకలా కేంద్రంలోని మంత్రులు మరొలా మాట్లాడి ప్రజలను డైలమాలో పడేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. అసలు వాళ్లు మాట్లాడింది కరెక్టా... లోకల్‌ లీడర్లు చెప్పింది కరెక్టా అని ప్రశ్నించారు కేటీఆర్. 


ధాన్యం కొనుగోలుపై దేశమంతతా ఒకటే పాలసీ ఉండాలనే లేకుంటే భవిష్యత్‌లో ఇలాంటి సమస్యలు వస్తాయన్నారు మంత్రి కేటీఆర్. వన్‌నేషన్ వన్‌ రేషన్ మాదిరిగానే వన్‌ నేషన్ వన్‌ ప్రొక్యూర్‌మెంట్‌ ఉండాలని చెప్పడం తప్పా అని ప్రశ్నించారు. పంజాబ్‌లో ధాన్యం కొనుగోలు చేసి తెలంగాణలో వద్దనడానికి కారణమేంటని ప్రశ్నించారు. 


తెలంగాణపై వివక్ష వద్దని గతేడాది నవంబర్‌ 12న అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేసి కేంద్రానికి సంకేతాలు పంపించామన్నారు మంత్రి కేటీఆర్. నవంబర్‌ 18న సీఎం, కేబినెట్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇందిరా పార్కు వద్ద నిరసన తెలిపారమన్నారు. 


ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రాన్ని నిలదీసిన ప్రతిసారి కూడా ప్రతిగింజను కొనిపించే బాధ్యత తమదే ఉంటా తెలంగాణ బీజేపీ నేతలు మైక్‌లు ముందు ప్రసంగాలు దంచేవారన్నారు. దీని వల్ల తమ మాట కాదని ఈసారి తెలంగాణలో 30 నుంచి 35 లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేశారన్నారు. ఇప్పుడు కోత దశకు వచ్చిన ఆ పంటను ఇప్పుడు ఎవరు కొనుగోలు చేయాలే బీజేపీ లీడర్లు, కేంద్రం చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్‌.



ఇప్పుడు కేంద్రంపై పోరాటం తప్ప తమకు వేరే మార్గం లేదంటున్నారు కేటీఆర్. అందుకే గ్రామస్థాయి నుంచే కార్యచరణ రెడీ చేయాలని నిర్ణయించింది టీఆర్‌ఎస్. ఈ నెల 4న టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లో నిరసన దీక్షలతో పోరాటం ప్రారంభమవుతుంది. 6న ముంబయి, నాగ్‌పూర్‌, బెంగళూరు, విజయవాడ జాతీయ రహదారులపై రాస్తారోకో చేయనున్నారు. 7న హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లా కేంద్రాల్లో వేలాది మంది రైతులు, టీఆర్‌ఎస్ శ్రేణులతో ఆందోళన చేస్తారు.  8న రాష్ట్రంలోని 12, 769 గ్రామపంచాయతీల్లో ప్రతి రైతు తన ఇంటిపై నల్లజెండాలు ఎగరేస్తారు. ర్యాలీలు నిర్వహిస్తారు. కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను తగుల బెట్టి నిరసన తెలుపుతారు. 11న దిల్లీలో టీఆర్ఎస్ మంత్రులు, ప్రజాప్రతినిధులు నిరసన తెలపనున్నారు. పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ ఎంపీలు కళమెత్తనున్నారు.