శుభాలను మోసుకొస్తున్న శుభకృత్‌ నామ సంవత్సరంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రగతి భవన్‌లో జరిగిన ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలకు ఆయన ఉగాది శుభాకాంక్షలు చెప్పారు. 


దేశానికి ఆదర్శంగా తెలంగాణ మారుతుందన్న కేసీఆర్.. రాష్ట్రాదాయం పెరుగుతుందని చెప్పారు. విద్య, విద్యుత్, తలసరి ఆదాయంలో మంచి ఫలితాలు సాధించామని... ఇక్కడితో ఆగిపోదని బంగారు తెలంగాణ సాధించే వరకు విశ్రమంచిబోమన్నారు. 







తెలంగాణలో సాధించిన సర్వతోముఖాభివృద్ధి కారణంగా భూముల ధరలు బాగా పెరిగాయన్నారు కేసీఆర్. మన వనరులు, ఉద్యోగాలు మనకే దక్కాలని ఆనాడు ఉద్యమం ప్రారంభించామని ఇప్పుడు అది సాకారమైందన్నారు. అనేక అనుమానాలతో ఉద్యమం ప్రారంభించామని వాటిని తొలగిస్తూ పోరాటాలు చేస్తూ ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నామన్నారు. 


ప్రత్యేక రాష్ట్రంలో ఎలాంటి వివక్ష లేకుండా బంగారు తెలంగాణ సాధన దిశగా దూసుకెళ్తున్నామని ఇకపై కూడా ఇది కొనసాగుతుందన్నారు కేసీఆర్. యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించుకున్నామని.. అన్ని దేవాలయాలు అలానే డెవలప్‌ చేసుకుంటామన్నారు. 


ఉగాది పండుగ సందర్భంగా హైదరాబాద్‌లోని తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఉగాది పచ్చడి తయారు చేసి, కుటుంబ సభ్యులతో కలిసి సేవించారు. ఈ ఏడాది ప్రజలకు అన్ని రంగాల్లోనూ శుభాలు జరగాలని ఆకాంక్షించారు. పంచాంగ శ్రవణంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. 






తెలంగాణ ప్రజలందరికీ ఎమ్మెల్సీ కవిత, మంత్రి హరీష్‌ రావు సహా ఇతరమంత్రులు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ శుభకృత్ నామ నూతన సంవత్సరంలో అందరికీ శుభాలు కలగాలని ట్విటర్‌ ద్వారా  ఆకాంక్షించారు.