దేశం స్థితిని మార్చడానికి, సరైన ప్రగతి పంథాలో నడిపించడానికి హైదరాబాద్ వేదికగా కొత్త ప్రతిపాదన, కొత్త సిద్ధాంతం, అజెండా తయారై దేశం నలుమూలలా వ్యాపిస్తే అది మన రాష్ట్రానికి దేశానికే గర్వకారణం అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులను, పార్టీలను కూడగట్టడం పరిష్కారం కాదని అన్నారు. అలాంటి కూటములు గతంలో ఏమీ సాధించలేదని అన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి కాకుండా, ప్రత్యామ్నా అజెండా కావాలని నొక్కి చెప్పారు. దేశంలో ప్రతి ఒక్కరు పని చేసేలా కొత్త ఆర్థిక, వ్యవసాయ, పారిశ్రామిక విధానాలు రావాలని ఆకాంక్షించారు. ఇలాంటి భారత్ లక్ష్యంగా పురోగమించాలని అన్నారు. అంతేకానీ, ఎల్లయ్యనో.. మల్లయ్యనో ప్రధానిని చేయడం కోసమో కూటములు కాదని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి చేయాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారని అన్నారు.
21 ఏళ్ల క్రితం తాను తెలంగాణ రాష్ట్రం అని మాట్లాడితే ఏం పని లేదా? తిన్నది అరుగుతలేదా అని కొందరు అన్నారని గుర్తు చేసుకున్నారు. సంకల్పంతో తల్లిదండ్రులకు, భగవంతుడికి దండం పెట్టి బయలుదేరి తెలంగాణ సాధించామని అన్నారు. ఈ తెలంగాణను దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచేలా చేశామని చెప్పారు. ఒకప్పుడు పాలమూరు జిల్లా నుంచి ముంబయికి వలసలు పోయేవారని.. ఇప్పుడు 11 రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలసలు వస్తున్నారని గుర్తు చేశారు. బిహారీ హమాలీ కార్మికులు లేకపోతే తెలంగాణ రైస్ మిల్లులు నడవవని.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ లో భవన నిర్మాణ రంగంలో యూపీ, బిహార్ కార్మికులు పని చేస్తున్నారని అన్నారు.
కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘చేయగలిగే సామర్థ్యం, సంకల్పం, చిత్త శుద్ధి ఉంటే ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగే అద్భుత అవకాశాలను భారత్ కలిగి ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. కానీ వాటిని వినియోగించుకోకుండా దు:ఖపడుతున్నామని అన్నారు. కేసీఆర్ రాజకీయ ఫ్రంట్ ప్రకటిస్తాడా? అని అందరూ అడుగుతున్నారు. ఫ్రంట్‌లు ముఖ్యం కాదు. దేశం బాగు కోసం ఒక ప్రక్రియ జరగాలి. ఈ దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దే ప్రత్యామ్నాయ అజెండాకు శ్రీకారం చుడదాం. దేశం బాగుపడటానికి మన రాష్ట్రం నుంచి, హైదరాబాద్ నుంచి ప్రారంభం జరిగితే అది మనందరికీ గర్వకారణం’’ అని సీఎం కేసీఆర్ అన్నారు.
గవర్నర్ వ్యవస్థపైనా విమర్శలు
గవర్నర్ వ్యవస్థపైన కూడా ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగానికి లోబడి ఉండాల్సిన గవర్నర్ వ్యవస్థను ఇప్పుడు దుర్మార్గంగా మార్చేశారని కేసీఆర్ విమర్శించారు. మహారాష్ట్రలో కీలకమైన ఓ ఫైల్‌ను అక్కడి గవర్నర్ ముందుకు కదలనీయకుండా దగ్గర పెట్టుకుని కూర్చున్నారని గుర్తు చేశారు. తమిళనాడులోనూ ఓ బిల్లు విషయంలో అదే పరిస్థితి నెలకొని ఉందని అన్నారు. మహారాష్ట్ర, బెంగాల్, కేరళ, తమిళనాడు లాంటి దాదాపు అన్ని రాష్ట్రాల్లో గవర్నర్‌ల వ్యవస్థలో పంచాయితీ ఉందని అన్నారు.