హైదరాబాద్‌లో ప్రభుత్వం హైఅలర్ట్‌ ప్రకటించింది. పాతబస్తీ సహా సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు చర్యలు చేపట్టింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది ప్రభుత్వం. ర్యాపిడ్‌ యాక్షన్ ఫోర్స్, సీఆర్‌పీఎఫ్‌, లోకల్‌ పోలీసులు ఓల్డ్‌సిటీలో మకాం వేశారు. 


బీజేపీ ఎమ్మెల్యే  రాజాసింగ్ రేపిన చిచ్చు ఇంకా చల్లారలేదు. ఆయన చేసిన కామెంట్స్‌తో రెచ్చిపోతున్న ఓ వర్గం ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. మొన్న రాత్రి సడెన్‌గా వివిధ పోలీస్‌స్టేషన్‌ల ముందు యువత పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. అందులో వివిధ పార్టీలకు చెందిన నేతలు కూడా పాల్గొన్నారు. మళ్లీ మంగళవారం రాత్రి కూడా అదే పరిస్థితి తలెత్తింది. ఉదయం వరకు పెద్ద ఎత్తున యువత రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేపట్టారు. రాజాసింగ్ దిష్టిబొమ్మలు తగలబెట్టారు. బెయిల్‌ వచ్చిందని తెలియగానే రగిలిపోయారు. 


బుధవారం కూడా అక్కడక్కడ కొందరు యువకులు హంగామా చేశారు. ఎప్పటికప్పుడు పోలీసులు అప్రమత్తంగా ఉంటూ పరిస్థితి అదుపు తప్పిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆగ్రహానికి గురి అవుతున్న యువతను అదుపులోకి తీసుకొని వారికి నచ్చజెప్పి పంపిస్తున్నారు. అయినా పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో అన్న కంగారు మాత్రం పోలీసుల్లో, ఇటు ప్రభుత్వ వర్గాల్లో కనిపిస్తోంది.  


ఈ పరిస్థితిపై ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో డీజీపీ మహేందర్‌రెడ్డి  కూడా పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకున్న సీఎం కేసీఆర్... కీలక సూచనలు చేసినట్టు తెలుస్తోంది.  పరిస్థితులు చేయిదాటిపోకుండా చూడాలని పోలీసులకు సూచించినట్టు కూడా తెలుస్తోంది. 


ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు మరింత కఠినమైన ఆంక్షలు విధించారు. దీంతో హైదరాబాద్‌ పోలీస్‌ సర్వేలైన్స్‌లోకి వెళ్లిపోయింది. ముఖ్యంగా పాతబస్తీపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఓల్డ్ సిటీకి వెళ్లే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సౌత్ జోన్‌లో కూడా ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. 


పురానాపూల్ బ్రిడ్జి, ఎంజే బ్రిడ్జి, నయాపూల్ బ్రిడ్జి, శివాజీ బ్రిడ్జి, చాద‌ర్‌ఘాట్ బ్రిడ్జి, చాద‌ర్‌ఘాట్ కాజ్‌వే, ముసారాంబాగ్ బ్రిడ్జి నుంచి ఓల్డ్ సిటీ, మ‌ల‌క్‌పేట్‌, ఎల్బీన‌గ‌ర్‌కు వెళ్లే వాహ‌న‌దారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సి వస్తోంది. ఎంజే మార్కెట్ నుంచి న‌యాపూల్ బ్రిడ్జి, ఎంజే బ్రిడ్జి, పురానాపూల్ బ్రిడ్జి నుంచి ఓల్డ్ సిటీకి వేళ్లే దారులు మూసేశారు. ఆ రూట్‌లో వెళ్ల వారిని 100 ఫీట్ రోడ్డు, జియ‌గూడ‌, రామ్‌సింగ్‌పురా, అత్తాపూర్, ఆరాంఘ‌ర్, మైలార్‌దేవ్‌ప‌ల్లి, చాంద్రాయ‌ణ‌గుట్ట మీదుగా మళ్లించారు. 


ఎంజే మార్కెట్ నుంచి న‌యాపూల్ బ్రిడ్జి, శివాజీ బ్రిడ్జి మీదుగా ఓల్డ్ సిటీకి చేరుకునే వారు.. రంగ‌మ‌హ‌ల్‌, చాద‌ర్‌ఘాట్‌, నింబోలి అడ్డ, టూరిస్ట్ జంక్షన్, బ‌ర్కత్పురా, ఫీవ‌ర్ హాస్పిట‌ల్‌, విద్యాన‌గ‌ర్‌, తార్నాక మీదుగా చేరుకోవాల్సి ఉంటుంది. అబిడ్స్, కోఠి నుంచి ఎల్బీన‌గ‌ర్‌, మ‌ల‌క్‌పేట్‌, దిల్‌సుఖ్‌న‌గ‌ర్ వెళ్లే వాహ‌న‌దారులు.. నింబోలిఅడ్డ, టూరిస్ట్ జంక్షన్, బ‌ర్కత్పురా, ఫీవ‌ర్ హాస్పిట‌ల్‌, విద్యాన‌గ‌ర్‌, తార్నాక లేదా 6 నంబ‌ర్, రామంతాపూర్ మీదుగా ప్రయాణించాలి. 


ఓల్డ్ సిటీ నుంచి అబిడ్స్, కోఠి, ఎంజే మార్కెట్‌, ల‌క్డీకాపూల్ వైపు వెళ్లాలంటే వేరే రూట్ చూసుకోవాల్సిందే. చాంద్రాయ‌ణగుట్ట, మైలార్‌దేవ్‌ప‌ల్లి, ఆరాంఘ‌ర్, అత్తాపూర్, మెహిదీప‌ట్నం, మాసాబ్‌ట్యాంక్‌, ల‌క్డీకాపూల్ మీదుగా చేరుకోవచ్చు. దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌, ఎల్బీన‌గ‌ర్ నుంచి అబిడ్స్, కోఠి, ఎంజే మార్కెట్ వెళ్లే వాహ‌న‌దారులు.. ఉప్పల్, తార్నాక‌, విద్యాన‌గ‌ర్, ఫీవ‌ర్ హాస్పిట‌ల్‌, బ‌ర్కత్పురా మీదుగా ప్రయాణించొచ్చు.


ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చర్యలు చేపట్టింది ప్రభుత్వం. ర్యాపిడ్‌ యాక్షన్ ఫోర్స్, సీఆర్‌పీఎఫ్‌, లోకల్‌ పోలీసులు పాతబస్తీలో భారీగా మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నారు.