ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా నేడు (జూన్ 22) తెలంగాణ అమరవీరుల స్తూపం ప్రారంభం ఉన్నందున ఆ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆ చుట్టుపక్కల కీలక మార్గాల్లో ట్రాఫిక్ ను అనుమతించబోమని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. నేడు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని చెప్పారు. ఎన్టీఆర్‌ మార్గ్, లుంబినీ పార్క్‌, నెక్లెస్‌ రోడ్ మార్గాలను పూర్తిగా మూసివేస్తామని తెలిపారు. ఈ ప్రభావంతో ఇతర మార్గాలైన వీవీ జంక్షన్, ఓల్డ్ సైఫాబాద్ పీఎస్ జంక్షన్, తెలుగు తల్లి జంక్షన్, నెక్లెస్ రోటరీ, రవీంద్ర భారతి, మింట్ కాంపౌండ్ రోడ్, నల్లగుట్ట జంక్షన్, కట్టమైసమ్మ, ట్యాంక్ బండ్, కర్బాల మైదాన్, లిబర్టీ, చిల్డ్రన్ పార్క్‌, రాణిగంజ్ రూట్‌లలో వాహనాలు పెరిగి ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, వాహన దారులు వీలున్నంత వరకూ వేరే మార్గాలు చూసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.


Traffic Diversions In Hyderabad: ట్రాఫిక్‌ మళ్లింపులు ఇవీ


ఖైరతాబాద్‌ విశ్వేశ్వరయ్య విగ్రహం - నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి జంక్షన్ వైపు ఎలాంటి వాహనాలను అనుమతి లేదు. ఖైరతాబాద్, పంజాగుట్ట, సోమాజిగూడ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాల​ను షాదాన్ కాలేజీ, నిరంకారీ భవన్ మీదుగా డైవెర్షన్ చేయనున్నారు. నిరంకారీ భవన్ నుంచి నెక్లెస్ రోటరీ వైపుగా ఖైరతాబాద్ ఫ్లై ఓవర్‌ ఓవర్ మీదుగా వాహనాలకు అనుమతించబోరు. ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ వైపు వాహనాలను అనుమతించరు. వారంతా తెలుగు తల్లి ఫ్లై ఓవర్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. 


ఎన్టీఆర్ మార్గ్ బంద్, సికింద్రాబాద్ - ట్యాంక్ బండ్ మార్గం కూడా మూసివేత


బుద్ధ భవన్‌ నుంచి నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్‌ మార్గ్‌ రూట్‌లో వచ్చే వాహనాలను నల్లగుట్ట క్రాస్ రోడ్స్ మీదుగా డైవెర్షన్ చేస్తారు. లిబర్టీ అంబేడ్కర్ విగ్రహం, బీఆర్‌కేఆర్ భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ రూట్‌లో వాహనాలకు అనుమతి ఉండదు. వాటిని ఇక్బాల్ మినార్ జంక్షన్ మీదుగా దారి మళ్లించనున్నారు. రాణిగంజ్, కర్బాల మైదాన్, కవాడిగూడ నుంచి ట్యాంక్‌ బండ్‌ వైపుగా వచ్చే వాహనాలను లోయర్ ట్యాంక్ బండ్ రూట్‌లోకి డైవర్ట్ చేస్తారు. బడా గణేశ్ లేన్ నుంచి ఐమాక్స్, నెక్లెస్ రోటరీ వైపు వెళ్లే వాహనాలను రాజ్‌దూత్ లేన్ మీదుగా మళ్లిస్తారు. సికింద్రాబాద్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వైపు వాహనాలకు కూడా అనుమతి లేదు. లోయర్ ట్యాంక్​ బండ్‌ సెయిలింగ్ క్లబ్ వద్ద దారి మళ్లిస్తామని ట్రాఫిక్‌ పోలీసులు చెప్పారు.


నేడే తెలంగాణ అమరవీరుల చిహ్నం ప్రారంభం
తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారి కోసం హుస్సేన్ సాగర్ పక్కన ఒక కొత్త స్మారకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఈ స్మారకాన్ని ప్రారంభించనున్నారు. ఎక్కడా అతుకులు లేకుండా కనిపించే స్టెయిన్ స్టీల్ తో దీన్ని నిర్మించారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది అని చెబుతున్నారు. ఒక స్టీలు ప్రమిదలో వెలుగుతున్న దీపంలా దీన్ని నిర్మించారు. వత్తి వెలుగుతోన్న ఆకారం మాత్రమే ఉంటుంది. నిజమైన మంట లేకుండా దానిపై లైటింగ్ వేస్తారు. 2017లో దీనికి శంకుస్థాపన చేశారు.  మొత్తం అయిన ఖర్చు రూ.178 కోట్లు. మొత్తం 3 ఎకరాల ప్రాంగణంలో నిర్మించారు.