Hyderabad Traffic News: కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah Hyderabad Tour) నేడు (మే 14) హైదరాబాద్‌కు రానున్న వేళ ఇవాళ నగరంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. అమిత్ షా వెళ్లే మార్గాల్లో హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరంలోని రామంతాపూర్‌తో పాటు మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని తుక్కుగూడలో అమిత్ షా పర్యటించనున్నారు. ఈ క్రమంలో ఆ రూట్లలో వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ట్రాఫిక్ సమస్య ఎదుర్కోకుండా వీరు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.
రామంతాపూర్‌లో ఏర్పాటు చేసిన సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ను అమిత్ షా నేడు ప్రారంభించనున్నారు. అనంతరం సెమినార్ హాల్‌లో నిర్వహించే కార్యక్రమంలో హోం మంత్రి అమిత్ షా పాల్గొంటారు. ఆ సమావేశం ముగిసిన అనంతరం తుక్కుగూడకు బయల్దేరి వెళ్తారు.
మధ్యాహ్నం 12 గంటల నుంచి ట్రాఫిక్ అంక్షలు ఉంటాయని పోలీసులు ప్రకటించారు. అంతేకాకుండా, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 గంటల వరకు శ్రీశైలం వైపునకు వాహనాలు అనుమతించబోరని తెలిపారు. దీంతో ఎల్‌బీనగర్, హయత్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట, చాంద్రాయణగుట్ట నుంచి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే వారు ప్రత్యమ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. అంతేకాకుండా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెం.14 నుంచి మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 11 గంటల వరకు భారీ వాహనాలు అనుతించబోమని పోలీసులు స్పష్టం చేశారు.
ఎల్బీ నగర్, హయత్ నగర్ నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్లే వారు మందమల్లమ్మ, బాలాపూర్, వీడియోకాన్ జంక్షన్ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు. దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట, చంద్రాయణగుట్ట నుంచి ఎయిర్‌పోర్ట్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను అరాంఘర్, శంషాబాద్ మార్గాల్లో మళ్లించనున్నట్లు పోలీసులు చెప్పారు.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర శనివారంతో ముగుస్తుంది. ఈ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా బీజేపీ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ సభకు అమిత్ షా హాజరుకానున్నారు. పాదయాత్రలో చివరి రోజైన మే 14న సాయంత్రం నిర్వహించనున్న ఛలో తుక్కుగూడ సభకు ఇప్పటికే సభ ఏర్పాట్లను పూర్తి చేశారు. బీజేపీ నేతలు మొత్తం 40 ఎకరాల్లో 5 లక్షలకు మించిన జనాలతో ఈ సభను నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక పోలీసులు అమిత్ షా పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు చేశారు. తుక్కుగూడ ఓఆర్‌ఆర్ ఎగ్జిట్-14 సమీపంలో ఈ సభ జరగనుంది.