కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేడు (మే 14) శ‌నివారం తెలంగాణ ప‌ర్యట‌న‌కు రానున్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజ‌య్ చేప‌ట్టిన ప్రజా సంగ్రామ యాత్ర శ‌నివారంతో ముగుస్తుంది. ఈ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా బీజేపీ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ సభకు అమిత్ షా హాజరుకానున్నారు. పాదయాత్రలో చివరి రోజైన మే 14న సాయంత్రం నిర్వహించనున్న ఛలో తుక్కుగూడ సభకు ఇప్పటికే సభ ఏర్పాట్లను పూర్తి చేశారు. బీజేపీ నేతలు మొత్తం 40 ఎకరాల్లో 5 లక్షలకు మించిన జనాలతో ఈ సభను నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక పోలీసులు అమిత్ షా పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు చేశారు. తుక్కుగూడ ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌-14 సమీపంలో ఈ సభ జరగనుంది.


అమిత్ షా రాకపై కేటీఆర్, కవిత ప్రశ్నల వర్షం
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు వస్తున్న వేళ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ప్రశ్నల వర్షం కురిపించారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మించాలని టీఆర్ఎస్ కోరితే బీజేపీ పట్టించుకోలేదని కేటీఆర్ అన్నారు. ‘‘గుజరాత్‌లో మాత్రం రూ.20 కోట్లతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం నిజం కాదా? రాష్ట్రానికి చట్టబద్ధంగా ఇచ్చిన హామీలను బీజేపీ నెరవేర్చలేదు. గుజరాత్‌కు మాత్రం ఇవ్వని హామీలను సైతం అమలు చేశారు. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో తెలంగాణ ఒక్కటంటే ఒక్క కేంద్రీయ విద్యాసంస్థనైనా ఏర్పాటు చేసిందా? 


ఎన్డీయే ప్రభుత్వం తెలంగాణకు కనీసం ఒక్క మెడికల్ కాలేజీని కూడా కేటాయించలేదు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం హామీ ఇచ్చిన బయ్యారం స్టీల్ ప్లాంట్‌ను తెలంగాణకు ఎందుకు కేటాయించలేదు? ఐటీఐఆర్ ప్రాజెక్టును అటకెక్కించడం, తెలంగాణకు కొత్త సాఫ్ట్‌వేర్ ప్రాజెక్టులను కేటాయించకపోవడం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోవడం, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆదేశాలకు అనుగుణంగా నీటి కేటాయింపులు జరపకపోవడం ఏంటి?’’ అని కేటీఆర్ ప్రశ్నించారు.






ప్రపంచంలోనే ఖరీదైన ఇంధనం - కవిత
తెలంగాణ ప్రజలకు కేంద్రం ఏం ఇచ్చిందో బెబుతారా? అంటూ వివిధ అంశాలపై ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. కేంద్రం నుంచి రావాల్సిన రూ.3 వేల కోట్లకు పైగా ఉన్న ఫైనాన్స్ కమీషన్ గ్రాంట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు? వెనుకబడి ప్రాంతాల అభివృద్ధి గ్రాంటు రూ.1350 కోట్లు, జీఎస్టీ పరిహారం రూ.2247 కోట్ల జీఎస్టీ పరిహారం సంగతేమిటి? గత 8 ఏళ్లలో తెలంగాణకు ఒక్క ఐఐటీ, ఐఐఎం, ఐఐఎస్‌ఈఆర్‌, ట్రిపుల్‌ ఐటీ, ఎన్‌ఐడీ, మెడికల్ కాలేజీలు, నవోదయ పాఠశాలలు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు విఫలమైంది? మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలన్న నీతి ఆయోగ్ సిఫార్సును కేంద్ర ప్రభుత్వం ఎందుకు విస్మరించింది? కర్ణాటకలోని ఎగువ భద్ర నీటిపారుదల ప్రాజెక్టుకు, కెన్ బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా నిరాకరించడం కేంద్రప్రభుత్వం కపటత్వం కాదా?’’ అని ఎమ్మెల్సీ కవిత వరుస ట్వీట్లు చేశారు. 


అంతేకాదు బీజేపీ అధీనంలో పెరిగిన నిరుద్యోగం, మతపరమైన అల్లర్లు, అత్యంత ఖరీదైన ఇంధనం, ఎల్‌పీజీని భారత్‌లోనే విక్రయించడంపై, విచ్చలవిడిగా పెరుగుతున్న ద్రవ్యోల్బనంపై సమాధానం ఏంటని కేంద్ర మంత్రి అమిత్ షాను ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.