Weather Latest News: నైరుతి రుతుపవనాల రాకకు సంబంధించి వాతావరణ విభాగం చల్లని కబురు వినిపించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆశించినదాని కన్నా ముందుగానే దేశంలోకి ప్రవేశిస్తాయని వెల్లడించింది. రుతుపవనాలు ఈ నెల 27న (4 రోజుల తేడాతో) కేరళలోకి ప్రవేశిస్తాయని వాతావరణ అధికారులు అంచనా వేశారు.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. భారత రుతుపవన ప్రాంతంలో, దక్షిణ అండమాన్ ప్రాంతంలో ప్రారంభ రుతుపవనాల వర్షాలు కురిశాయి. రుతుపవనాల గాలులు రుతుపవనాలు బంగాళాఖాతం మీదుగా వాయువ్య దిశగా ముందుకు సాగుతాయి. రుతుపవనాల ప్రారంభం, పురోగతి ప్రకారం నైరుతి రుతుపవనాలు సాధారణ తేదీలు, అండమాన్ సముద్రం మీదుగా మే 22న పురోగమిస్తాయి. భూమధ్య రేఖను దాటి విస్తరించిన గాలులతో అనుబంధంగా, రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రంలో, నికోబార్ దీవులు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని భాగాలలో ప్రవేశించడానికి దాదాపు మే 15 తేదీకి పరిస్థితులు అనుకూలంగా మారతాయి.
Telangana Weather తెలంగాణలో వాతావరణం ఇలా
హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. తెలంగాణలో నేడు స్వల్పంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్, జోగులాంబ గద్వాల, ఖమ్మం, మహబూబ్ నగర్, మేడ్చల్ మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణ పేట, రంగారెడ్డి, వనపర్తి తదితర జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఏపీలో వాతావరణం ఇలా..
ఇక ఏపీలో తుపాను ప్రసరణ తీర ప్రాంతం సహా ఉత్తర కోస్తా ప్రాంతంలో ఎక్కువగా విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇది సముద్ర మట్టం నుంచి 3.1 కిలో మీటర్ల ఉపరితలం వరకూ వ్యాపించి ఉందని అంచనా వేశారు. నైరుతి రుతుపవనాలు కూడా ఈ ఏడాది త్వరగానే వస్తాయని అంచనా వేశారు.
ఇక రాయలసీమలో ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో ఆకాశం మేఘాలు పట్టి ఉంటుందని వివరించారు. దీనికి సంబంధించి పసుపు రంగు అలర్ట్ జారీ చేశారు. గాలులు కూడా వీయడం వల్ల ముఖ్యంగా అరటి పంటకు నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందని వివరించారు.