ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. అనంతరం బెంగళూరు 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో పంజాబ్ కింగ్స్ 54 పరుగులతో విజయం సాధించింది.
భారీ స్కోరు చేసిన పంజాబ్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌కు మెరుపు ఆరంభం దక్కింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (21: 15 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్), జానీ బెయిర్‌స్టో (66: 29 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఏడు సిక్సర్లు) బెంగళూరు బౌలర్లను చీల్చి చెండాడారు. మొదటి వికెట్‌కు ఐదు ఓవర్లలోనే 60 పరుగులు జోడించారు. అనంతరం గ్లెన్ మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో శిఖర్ ధావన్ అవుటయ్యాడు. అనంతరం మహ్మద్ సిరాజ్ వేసిన ఆరో ఓవర్లో 23 పరుగులు రావడంతో పంజాబ్ పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 83 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో పవర్ ప్లేలో ఒక జట్టు చేసిన ఇదే అత్యధిక స్కోరు ఇదే.
భనుక రాజపక్స (1: 3 బంతుల్లో) విఫలం కాగా... ఆ తర్వాత బెయిర్‌స్టో కూడా అవుట్ కావడంతో పంజాబ్ 101 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో లియాం లివింగ్‌స్టోన్ (70: 42 బంతుల్లో, ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) ఎప్పటిలాగే చెలరేగి ఆడాడు. తనకు మయాంక్ అగర్వాల్ (19: 16 బంతుల్లో, మూడు ఫోర్లు) నుంచి చక్కటి సహకారం లభించింది. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 51 పరుగులు జోడించారు. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి మయాంక్ అవుట్ కావడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది.
ఆ తర్వాత మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లభించకపోయినా... లివింగ్‌స్టోన్ ఒక ఎండ్‌లో చెలరేగి ఆడాడు. ఒకదశలో పంజాబ్ 220 పరుగుల మార్కును అందుకునేలా కనిపించింది. అయితే చివరి ఓవర్లో హర్షల్ పటేల్ నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీయడంతో తొమ్మిది వికెట్ల నష్టానికి 209 పరుగులకు పరిమితం అయింది. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్‌కు నాలుగు, వనిందు హసరంగకు రెండు వికెట్లు దక్కాయి. మ్యాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్‌లు చెరో వికెట్ తీసుకున్నారు.
ఎవరూ రాణించకపోవడంతో..
210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు ఇన్నింగ్స్‌ను వేగంగానే ప్రారంభించింది. విరాట్ కోహ్లీ (20: 14 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్), ఫాఫ్ డుఫ్లెసిస్ (10: 8 బంతుల్లో, రెండు ఫోర్లు) మొదటి వికెట్‌కు 3.2 ఓవర్లలోనే 33 పరుగులు జోడించారు. రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో టచ్‌లో కనిపించిన కోహ్లీ... రబడ బౌలింగ్‌లో అనూహ్యంగా అవుటయ్యాడు. బంతి గ్లవ్‌ని రాసుకుంటూ పోయి బాడీకి తగిలి గాల్లోకి లేచి నేరుగా రాహుల్ చాహర్ చేతిలో పడింది. దీంతో బెంగళూరు మొదటి వికెట్ కోల్పోయింది.
ఆ తర్వాతి ఓవర్లోనే ఫాఫ్ డుఫ్లెసిస్, మహిపాల్ లొమ్రోర్ (6: 3 బంతుల్లో, ఒక సిక్సర్) కూడా అవుటయ్యారు. ఈ దశలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ (35: 22 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్), రజత్ పాటీదార్ (26: 21 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు)ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే బాధ్యత తీసుకున్నారు. నాలుగో వికెట్‌కు వీరిద్దరూ 54 పరుగులు జోడించారు. వీరిద్దరూ వరుస ఓవర్లలో అవుట్ కావడంతో బెంగళూరు కష్టాల్లో పడింది. ఆ తర్వాత ఏదశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. ఎవరూ రాణించకపోవడంతో బెంగళూరు 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 155 పరుగులకే పరిమితం అయింది.-