సికింద్రాబాద్‌లో ఆర్మీ డే ఉత్సవాలు- సందర్శకులకు అనుమతి. 


ఆర్మీడే సందర్భంగా సికింద్రాబాద్‌లోని పెరేడ్ గ్రౌండ్ నిర్వహిస్తున్న ఆర్మీ ఆయుధాల ప్రదర్శన ఇవాళ కూడా కొనసాగనుంది. ఈ రోజు సాయంత్ర వరకు ప్రదర్శన ఉంటుంది. ఆర్మీ అధికారులు ఉపయోగించే ఆయుధాలను వీక్షించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు. ఆర్మీలో ఎటువంటి ఆయుధాలు ఉపయోగిస్తారని తెలుసుకోవడంలో ఆనందంగా ఉందని సందర్శకులు అంటున్నారు. 


నెక్లెస్ రోడ్ లో కైట్ ఫెస్టివల్. 


సంక్రాంతి పండుగ పురస్కరించుకొని హైదరాబాద్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో ఉయదం కైట్ ఫెస్టివల్ ప్రారంభమైంది. సాగర తీరాన పతంగులు ఎగురవేయడానికి యువత పెద్ద ఎత్తున చేరుకోనున్నారు. సాయంత్రం వరకు ఈ కైట్ ఫెస్టివల్ కొనసాగనుంది. రంగు రంగుల పతంగులతో యువత నెక్లెస్ రోడ్ కు చేరుకుంటున్నారు. 


శిల్పారామంలో ప్రత్యేక కార్యక్రమాలు. 


సంక్రాంతి పండుగకు ఊరు వెళ్లలేని నగరవాసులకు అసలైన సంక్రాంతి అనుభూతిని కలిగించేందుకు హైదరాబాద్‌లోని శిల్పారామంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గంగిరెద్దుల డ్యాన్స్, సంక్రాంతి ముగ్గులు, హరిదాసులతోపాటు అనేక ప్రత్యేక కార్యక్రమాలు రూపకల్పన చేశారు. మాదాపూర్ లోని శిల్పారామంలోనూ, ఇటు ఉప్పల్ లోని శిల్పారామంలోనూ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 


వందే భారత్ ట్రైన్ కు బుకింగ్ ప్రారంభం. 


తెలుగు రాష్ఠ్రాల మధ్య పట్టాలెక్కి పరుగులు పెట్టనున్న వందే భారత్ రైలు సర్వీస్ కు బుకింగ్ ప్రారంభమైంది. మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు తెలుగు రాష్ట్రాల మధ్య రేపు ఉదయం నుంచి పరుగులు మొదలుపెట్టనుంది. ఇప్పటిదాకా దేశ వ్యాప్తంగా ప్రవేశపెట్టిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఈ రైలు ఎనిమిదోది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య ఈ రైలు రాకపోకలు సాగించనుంది. ఒక ఆదివారం తప్ప వారానికి 6 రోజుల పాటు ఈ రైలు సర్వీసులు ఉంటాయి. రేపు ఉదయం 10 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ వందేభారత్ ట్రైన్ ను వర్చువల్ గా జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ నెల 16 నుంచి రెగ్యులర్ సర్వీస్ ప్రారంభం కానుంది. 


వందే భారత్ రైల్  టైమింగ్స్ ఇవీ
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నెంబరు 20833. సికింద్రాబాద్ - విశాఖపట్నం రైలు నెంబరు 20834. విశాఖపట్నం నుంచి రైలు ఉదయం 5.45 గంటలకు బయలుదేరుతుంది. మధ్యలో రాజమండ్రి (7.55), విజయవాడ (10.00), ఖమ్మం (11.00), వరంగల్ (12.05), సికింద్రాబాద్ (14.15) గంటలకు చేరుకుంటుంది.


మళ్లీ సికింద్రాబాద్ నుంచి 15.00 (మధ్యాహ్నం 3 గంటలు) గంటలకు బయలుదేరి వరంగల్ (16.35), ఖమ్మం (17.45), విజయవాడ (19.00), రాజమండ్రి (20.58), విశాఖపట్నం 23.30 గంటలకు చేరుతుంది. తిరిగి మళ్లీ ఉదయం సర్వీసు యథావిధిగా కొనసాగుతుంది. ఒక్క ఆదివారం తప్ప మిగతా రోజుల్లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు ఉంటాయి.


తెలుగు రాష్ట్రాల మధ్య నడవనున్న వందే భారత్ రైలు కోసం ముందే ఖరారు చేసిన షెడ్యుల్ లో మార్పు చేశారు. ఖమ్మం ప్రజల ఒత్తిడి నేపథ్యంలో కొత్తగా ఖమ్మం స్టేషన్‌లో వందేభారత్ రైలును ఆపాలని నిర్ణయించారు. ఈ రైలుకు 18 బోగీలు ఉండగా.. ప్రైమరీ మెయింటెనెన్స్ విశాఖపట్నంలోనే ఉండనుంది.



ఉప్పల్ వన్డే క్రికెట్ మ్యాచ్ కు టిక్కెట్ల విక్రయం 


హైదరాబాద్‌ ఉప్పల్ క్రికెట్‌ స్టేడియం మరో ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌కు వేదిక కాబోతోంది. ఈనెల 18న భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య వన్డే ఫైట్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌కి సంబంధించిన టికెట్లు 4 రోజులపాటు విక్రయించబోతున్నారు. అయితే, గత చేదు అనుభవం దృష్ట్యా టికెట్లన్నీ ఆన్‌లైన్‌ ద్వారానే అమ్ముతున్నారు. స్టేడియం సీటింగ్‌ కెపాసిటీ 39వేల 112 కాగా, కాంప్లిమెంటరీ కింద 9వేల 695 టికెట్స్‌ వెళ్లిపోనున్నాయి. మిగతా 29వేల 417 టికెట్స్‌ను ఆన్‌లైన్‌లో విక్రయించనున్నారు. ఈసారి, ఆఫ్‌లైన్‌లో టికెట్‌ విక్రయాలు ఉండబోవని తేల్చిచెప్పింది హెచ్‌సీఏ.
 
నాలుగు విడతలుగా టికెట్లను అమ్మనున్నారు. ఒక్కొక్కరికి నాలుగు టికెట్లు ఇస్తున్నారు. ఆన్‌లైన్‌లో టికెట్లు తీసుకున్నా, తర్వాత ఫిజికల్‌ టికెట్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ఫిజికల్‌ టికెట్‌ ఉంటేనే స్టేడియంలోకి అనుమతిస్తామంటోంది హెచ్‌సీఏ. ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంలో ఫిజికల్‌ టికెట్స్‌ను కలెక్ట్‌ చేసుకోవాల్సి ఉంటుందని ప్రకటించింది. బ్లాక్‌ టికెట్ అమ్మకాలు జరగకుండా ఉండేందుకే హెచ్‌సీ ఈ చర్యలు తీసుకున్నామంటోంది.