Amberpet CI Arrest :ఎన్ఆర్ఐను చీటింగ్ చేసిన కేసులో హైదరాబాద్ అంబర్ పేట్ సీఐ సుధాకర్ ను వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ల్యాండ్ రిజిస్ట్రేషన్ పేరుతో ఎన్ఆర్ఐను సీఐ సుధాకర్ మోసం చేసినట్లు కేసు నమోదైంది. ఈ కేసులో వనస్థలిపురం పోలీసులు సీఐ సుధాకర్ ను శుక్రవారం అరెస్ట్ చేశారు. ఎన్ఆర్ఐ నుంచి సుధాకర్ రూ.54 లక్షలు తీసుకుని మోసం చేసినట్లు తెలుస్తోంది.  ఆయనను హయత్ నగర్ లోని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి, రిమాండ్ కు తరలించనున్నారు. 


ఎన్ఆర్ఐను చీట్ చేసిన సీఐ 


హైదరాబాద్ అంబర్‌పేట సీఐ సుధాకర్‌ ను పోలీసులు అరెస్టు చేశారు. భూమి వ్యవహారంలో ఓ వ్యక్తిని మోసం చేసిన ఆరోపణల కారణంగా సీఐను వనస్థలిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్ని రోజుల క్రితం వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌లో సీఐ సుధాకర్‌పై కేసు నమోదు అయింది. ఎన్ఆర్ఐకు భూమి ఇస్తానని సీఐ సుధాకర్‌ రూ.54 లక్షలు తీసుకున్నట్టు కేసు నమోదు అయింది. కందుకూరు మండలంలోని ఓ గ్రామంలో వ్యవసాయ భూమి విక్రయిస్తానని సీఐ డబ్బులు తీసుకున్నారు. నెలలు గడుస్తున్నా భూమి రిజిస్ట్రేషన్‌ చేయకుండా మోసం చేశారని గుర్తించిన బాధితుడు వనస్థలిపురం పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇవాళ సీఐ సుధాకర్ ను పోలీసులు అరెస్టు చేశారు.  


నకిలీ ఎమ్మార్వోను రంగంలోకి దింపి


నాలుగు రోజుల కిందట ఎన్ఆర్ఐ వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా, పూర్తిస్థాయిలో విచారణ జరిపిన పోలీసులు సీఐ సుధాకర్ ని అరెస్ట్ చేశారు. తాను చెప్పిన ప్రదేశంలో భూమి కొంటే, భవిష్యత్తులో దాని విలువ భారీగా పెరుగుతుందని సీఐ సుధాకర్ ఎన్ఆర్ఐను నమ్మించి మోసం చేసినట్లు తెలిసింది. ఓ నకిలీ ఎమ్మార్వోను రంగంలోకి దింపి, అతడు త్వరలోనే ఆర్డీవో అవుతాడంటూ ఎన్ఆర్ఐకి నమ్మకం కలిగించేందుకు ప్రయత్నించినట్టు పోలీసుల దర్యాప్తులో తెలింది. ఎన్నారై నుంచి రూ.54 లక్షలు తీసుకున్న తర్వాత, సీఐ ముఖం చాటేశారని, భూమి ఇప్పించకుండా  డబ్బులు తిరిగి ఇవ్వకుండా వేధించాడని బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. 




ఏసీబీ చిక్కిన ఎస్ఐ శ్రవణ్ 


 హైదరాబాద్ పాతబస్తీలో శుక్రవారం లంచం తీసుకుంటూ ఓ పోలీస్ అధికారు ఏసీబీకి పట్టుబడ్డాడు. బహదూర్‌పురా ఎస్ఐ శ్రవణ్‌ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. సీజ్ చేసిన మొబైల్ ఫోన్‌ను తిరిగి ఇచ్చేయడానికి బాధితుడి నుంచి రూ.8000 లంచం డిమాండ్ చేశారు ఎస్ఐ శ్రవణ్. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఎస్ఐను పట్టుకున్నారు. ఎస్ఐను రిహాండ్‌కు తరలించింది. ఎస్ శ్రవణ్ నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించారు. అతడి ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నారు.


పోలీస్ అకాడమీలో పట్టుబడ్డ ఇంటి దొంగ


 హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని  నేషనల్‌ పోలీస్ అకాడమీలో దొంగతనం జరిగింది. కట్టుదిట్టమైన భద్రత కలిగిన IPS ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ అకాడమీలో కంప్యూటర్లు మాయం అయ్యాయి.  భద్రతా బలగాల కళ్లు గప్పి 7 కంప్యూటర్లను కేటుగాడు మాయం చేశాడు. కట్టుదిట్టమైన భద్రత కలిగిన IPS ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ నుంచి చాకచక్యంగా కంప్యూటర్లు దొంగలించడం కలకలం రేపుతోంది. కంప్యూటర్లు చోరీకి గురవ్వడంతో అధికారులు సీసీటీవీ ఫూటేజ్ పరిశీలిస్తున్నారు. సీసీ ఫూటేజ్ లో దొంగతనం దృశ్యాలు రికార్టు అయ్యాయి.  అకాడమీలో ఐటీ సెక్షన్ లో పనిచేస్తున్న చంద్రశేఖర్ గా అనే వ్యక్తి కంప్యూటర్లు చోరీ చేసినట్లు గుర్తించారు. ఈ ఘటనపై ఎన్పీఏ అధికారులు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.