Hyderabad Drugs Case: హైదరాబాద్‌లో సంచలనం రేపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు రాన్రానూ మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఇక ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇక దూకుడు పెంచనుంది. ఇందులో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ సెలబ్రిటీలను మరోసారి విచారణకు పిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. డ్రగ్స్ లావాదేవీలు, డ్రగ్స్ కొనుగోళ్లు, మనీ ల్యాండరింగ్ అంశాలపై ఈడీ మరోసారి విచారణ జరపనుంది.


ఈ టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ రంగంలోకి దిగిన అనంతరం గతంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో విచారణ జరిపిన అన్ని రికార్డులను తమకు ఇవ్వాలని ఈడీ హైకోర్టును కోరిన సంగతి తెలిసిందే. ఆ రికార్డులు ఈడీకి సమర్పించాలని గతంలోనే హైకోర్టు ఆదేశాలిచ్చింది. ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను దాఖలు చేసింది. దీంతో తాజాగా ఈడీ అడిగిన అన్ని వివరాలను ప్రభుత్వం ఇచ్చేసింది. డిజిటల్ రికార్డులు, కాల్ డేటా, ఎఫ్ఎస్ఎల్ నివేదికలను ఈడీకి అందించినట్లుగా ప్రభుత్వం  తెలిపింది. ఈడీ అడిగిన వివరాలు ఇచ్చినట్లు హైకోర్టు రిజిస్ట్రార్‌ కు ప్రభుత్వం మెమో దాఖలు చేసింది.


తాము అడిగిన రికార్డులను హైకోర్టు ఆదేశించినా ఎక్సైజ్ శాఖ ఇవ్వకపోవడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌పై హైకోర్టులో ఈడీ.. కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది. తాజాగా అన్ని రికార్డులు ఇవ్వడంతో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను ఈడీ వెనక్కి తీసుకుంది. దీంతో టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరో మలుపు తిరిగినట్లయింది. 


ఇక ఈ కేసుకి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ ప్రముఖులను మరోసారి ఈడీ విచారణ జరపనుంది. ఎక్సైజ్ శాఖ ఇచ్చిన డిజిటల్ రికార్డులు, కాల్ డేటాను ఈడీ పరిశీలిస్తోంది. వీటి ఆధారంగా మరోసారి సినీ ప్రముఖులను విచారించనున్నట్టు తెలుస్తోంది. డ్రగ్స్ లావాదేవీలు, డ్రగ్స్ కొనుగోళ్లు, మనీ ల్యాండరింగ్ అంశాలపై కూపీ లాగనుంది.


క్లీన్ చిట్ ఇచ్చిన ఎక్సైజ్ శాఖ
2017లో ఎక్సైజ్‌ శాఖ నమోదు చేసిన కేసులతో టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం తెరపైకి వచ్చింది. అధికారులు కెల్విన్‌ మార్కెరాన్స్‌ అనే వ్యక్తిని అరెస్టు చేసి అతడి నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. విచారణలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అనేక మందికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అతడు చెప్పడంతో కలకలం రేగింది. దీంతో అప్పటి ఎక్సైజ్ కమిషనర్ అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో సుదీర్ఘంగా సాగిన సినీ ప్రముఖుల దర్యాప్తులో ఎక్సైజ్ అధికారులు ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోయారు. కొందరి గోళ్లు, వెంట్రుకలు సేకరించి ఫోరెన్సిక్‌ పరిశోధనకు పంపారు. అన్ని కోణాల్లో దర్యాప్తుతో పాటు సాక్షులనూ విచారించారు. దాదాపు మూడేళ్లపాటు దర్యాప్తు చేసినా దీనిపై ప్రాథమిక ఆధారాలూ లభించలేదు. 


మళ్లీ గత ఆగస్టులోనూ 
రెండోసారి గత ఏడాది ఆగస్టులోనూ పూరీ జగన్నాథ్‌, రవితేజ, రానా, ఛార్మి, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, తరుణ్ వంటి 12 మందిని కూడా విచారించారు. వారందరి బ్యాంకు లావాదేవీలు పరిశీలించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపినా కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ లభించకపోవడంతో వారందరికీ తెలంగాణ ఎక్సైజ్ శాఖ క్లీన్ చిట్ ఇచ్చింది. ఎక్సైజ్ దర్యాప్తు ముగిసిన తరుణంలో అకస్మాత్తుగా ఈడీ అధికారులు రంగంలోకి దిగారు.