Hyderabad Traffic Challans Discount Offer: వాహనదారులకు అలర్ట్! ట్రాఫిక్ చలాన్లపై హైదరాబాద్ పోలీసులు ప్రకటించిన భారీ డిస్కౌంట్ ఆఫర్ ముగింపు తేదీ దగ్గర పడుతోంది. ముందుగా ప్రకటించిన ప్రకారం మరో రెండు రోజుల్లోనే ఈ డిస్కౌంట్ ఆఫర్ ముగియనుంది. ఆ తేదీ ఇక పెంచేది లేదని పోలీసులు గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. చలాన్లపై పోలీసుల భారీ రాయితీ ఆఫర్‌తో వాహనదారుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. దొరికిందే ఛాన్స్ అనుకొని అంతా తమ చలాన్లను ఆన్‌లైన్ ద్వారా చెల్లించేశారు.


చలాన్లపై డిస్కౌంట్ ముగింపు తేదీ సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికీ ఎవరైనా చలాన్లను కట్టకపోయి ఉంటే వెంటనే ఆన్‌లైన్‌లో చెల్లించండి. లేదంటే తర్వాత అసలు చలాన్ల ధర చెల్లించాల్సి ఉంటుంది. పోలీసులు అందించిన ఈ భారీ డిస్కౌంట్‌ ఆఫర్‌ను ఇప్పటికే తెలంగాణలో 50 శాతం మంది క్లియర్ చేశారు.


తాజాగా, ఈ ఆఫర్‌పై పోలీసులు కూడా అలర్ట్ ఇచ్చారు. కేజీఎఫ్ సినిమా ట్రైలర్‌లోని డైలాగ్ కూడా వాడేశారు. ఇక మిగిలింది మూడు రోజులే.. మీ వాహనాలపై ఉన్న ట్రాఫిక్ చాలానాలను మార్చి 31వ తారీఖులోపు చెల్లించాలంటూ సూచించారు. ఈ అవకాశాన్ని నిర్లక్ష్యంతో చేజార్చుకోవద్దని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన రాయితీని సద్వినియోగం చేసుకోవాలని.. ఆలస్యం చేయొద్దని సూచించారు. కె.జి.యఫ్‌ ఛాప్టర్‌ 2 ట్రైలర్‌లోని ఆఫర్‌ క్లోజెస్‌ సూన్‌ డైలాగ్‌ మీమ్‌ను కూడా హైదరాబాద్‌ సిటీ పోలీసులు వాడేశారు.


ఎక్కువగా కట్టింది వీరే..
హైదరాబాద్ నగరంలో మాత్రమే ప్రస్తుతానికి పోలీసులు ఈ ఆఫర్ ప్రవేశపెట్టారు. కాగా, ఈ ఆఫర్‌కు అత్యధిక స్పందన వచ్చిన వారిలో ద్విచక్రవాహన దారులే అధికంగా ఉన్నారు. హెల్మెట్ లేని ప్రయాణం, రాంగ్ రూట్ డ్రైవింగ్ తదితర ఉల్లంఘనలకే చలాన్లు అధికంగా ఉన్నాయి.


పోలీసులు ఫేస్‌బుక్‌, ట్విటర్‌లో ఇలా పోస్ట్ చేశారు. ‘‘ఇక మిగిలింది మూడు రోజులే.. మీ వాహనాలపై ఉన్న ట్రాఫిక్ చాలానాలను మార్చ్ 31వ తారీఖులోపు చెల్లించండి. అవకాశాన్ని నిర్లక్ష్యంతో చేజార్చుకోకండి, ప్రభుత్వం ఇచ్చిన రాయితీనీ సద్వినియోగం చేసుకోండి. ఆలస్యం చేయకు మిత్రమా అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు.’’ అంటూ పోలీసులు ట్వీట్ చేశారు.



https://echallan.tspolice.gov.in/publicview వెబ్‌సైట్‌ ద్వారా వాహనదారులు తమ పెండింగ్ చలానాలను రాయితీతో చెల్లించవచ్చు. పేటీఏం, గూగుల్ పే వంటి యూపీఐ యాప్స్‌ను కూడా ఉపయోగించి కూడా పెండింగ్ చలాన్‌లను క్లియర్ చేసుకోవచ్చు. టూ వీలర్ వాహనదారులకు 75 శాతం రాయితీని ప్రకటించగా.. కార్లు, మోటార్ వెహికల్స్‌కు 50 శాతం రాయితీ ఇచ్చారు. అలాగే తోపుడు బండ్ల నిర్వాహకులకు 80 శాతం, ఆర్టీసీ బస్సులకు 70 శాతం రాయితీలను ప్రకటించారు. దీంతో పాటుగా మాస్కు ధరించకుండా తిరిగిన వారికి విధించిన రూ.వెయ్యి రూపాయల జరిమానాకు బదులు కేవలం రూ.వంద రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది.