Hyderabad Crime : ఉద్యోగం ఇప్పిస్తానని యువతికి మాయమాటలు చెప్పాడో కేటుగాటు. కాల్ లేటర్ ఇస్తానని ఓయో హోటల్ తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. హోటల్ రూంలో బంధించి ఫొటోలు తీశాడు. యువతి హోటల్ నుంచి తప్పించుకోవడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం ఇప్పిస్తానని యువతిని తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ ఎస్‌ఆర్‌నగర్‌ లో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం కర్నూలు జిల్లా కొలిమిగండ్ల మండలానికి చెందిన ఓ కుటుంబం ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చి చైతన్యపురి కాలనీలో అద్దెకు ఉంటున్నారు. ఆ కుటుంబానికి చెందిన 19 ఏళ్ల యువతి ఇంట్లో పరిస్థితి చూసి టెలీకాలర్‌గా పని చేస్తోంది. ఆ యువతి ఫోన్‌ నెంబర్‌ సంపాదించిన సిద్ధార్థరెడ్డి అనే యువకుడు ఆమెకు ఫోన్‌ చేసి తమ కంపెనీలో ఉద్యోగం ఖాళీగా ఉందని, నెలకు రూ.18 వేల జీతం ఇస్తామని నమ్మించాడు. 


ఓయో రూమ్ లో బంధించి అత్యాచారం 


ఈ నెల 9వ తేదీన కారులో దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి యువతిని తీసుకుని ఎర్రగడ్డకు తీసుకువచ్చాడు సిద్ధార్థరెడ్డి. కారులో వస్తున్నప్పుడే యువతి ఫొటోలు, సర్టిఫికెట్లు జిరాక్స్‌లు తీసుకున్నాడు. ఎర్రగడ్డలోని ఓయోలో ఓ గదిని తీసుకుని అందులో యువతిని దింపాడు. హోటల్ లో దింపడంపై అనుమానం వచ్చిన యువతి ప్రశ్నించింది. కాల్ లేటర్ ఇచ్చేందుకు ఆలస్యమవుతుందని, రాత్రి భోజనం చేశాక లేటర్ ఇస్తామని యువతిని నమ్మించి హోటల్ గదిలో ఉంచాడు. లేటర్ తో పాటు కొన్ని డబ్బులు అడ్వాన్స్‌గా ఇస్తానని మాయమాటలు చెప్పాడు. ఆ తర్వాత యువతిపై అత్యాచారం చేసి ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఫొటోలు సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరించాడు. హోటల్‌ నుంచి ఎలాగో తప్పించుకున్న యువతి, ఇంటికి చేరుకుంది. తనకు జరిగిన విషయాన్ని ఇంట్లో చెప్పింది. ఈ ఘటనపై ఆమె కుటుంబ సభ్యులు చైతన్యపురి స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కేసును ఎస్‌ఆర్‌నగర్‌కు బదిలీ చేశారు.    


ఇటీవలే మరో ఘటన 


 హైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతిపై ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్ చేశారు.  కోఠి నుంచి జూబ్లీహిల్స్ కు వెళ్లేందుకు యువతి ఆటో ఎక్కింది. మార్గమధ్యలో ఆటో డ్రైవర్ తన స్నేహితులకు ఫోన్ చేసి రమ్మన్నాడు. యువతిని జిల్లెలగూడ గాయత్రి నగర్ లోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ముగ్గురు యువకులు అత్యాచారం చేసినట్లు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అఖిల్, నితిన్, ప్రశాంత్, శీనులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Also Read : Vikarabad Rape: పదో తరగతి బాలికపై యువకుడు రేప్, ఆ వెంటనే ఇంకో ఘోరం