Hyderabad:


హీరో, ‘మా’ అధ్యక్షుడు (MAA President) మంచు విష్ణు (Manchu Vishnu) ఆఫీసులో దొంగతనం జరిగింది. దీనిపై హైదరాబాద్‌లోని (Hyderabad) జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. మంచు విష్ణుకు వ్యక్తిగత హెయిర్‌ స్టైలిస్ట్‌ ఉన్న వ్యక్తి నిందితుడని ప్రాథమికంగా నిర్థరించి అతనిపై కేసు నమోదు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మంచు విష్ణు వద్ద చాలా కాలంగా బోరబండ ప్రాంతానికి చెందిన యు.నాగశ్రీ అనే వ్యక్తి పర్సనల్ హెయిర్‌ సైలిస్ట్‌గా పని చేస్తున్నాడు. అతను ఈ నెల 17న జూబ్లీహిల్స్‌ సీబీఐ కాలనీలో ఉన్న మంచు విష్ణు కార్యాలయంలో ఆయనకు చెందిన రూ.5 లక్షల విలువైన హెయిర్‌ డ్రెస్సింగ్‌, సెట్టింగ్, మేకప్‌ సామగ్రిని (Manchu Vishnu Office) తీసుకెళ్లిపోయాడు. ఎవరికీ చెప్పకుండా, ఎలాంటి అనుమతి లేకుండా వాటితో మాయం అయ్యాడు. వాటి గురించి ఆరా తీసేందుకు ఫోన్‌లో సంప్రదించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో చోరీకి పాల్పడిన వ్యక్తి అతనే అని నిర్ధారణకు వచ్చారు. ఈ విషయంపై అతను చోరీకి పాల్పడినట్లు లీగల్‌ మేనేజర్‌ సంజయ్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఈ నెల 19న ఫిర్యాదు చేశారు.


మరోవైపు, మంచు విష్ణు హీరోగా నటించిన ఆఖరి చిత్రం మోసగాళ్లు (Mosagallu). నిర్మాతగా వ్యవహరించిన చిత్రం మోహన్ బాబు హీరోగా నటించిన ‘సన్ ఆఫ్ ఇండియా’ (Son Of India). ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం పొందిన సంగతి తెలిసిందే. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్‌, అంతకు ముందు ఇచ్చిన హైప్ కారణంగా జనాల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. దీంతో జనం బాగా ఎదురు చూశారు. కానీ, విడుదలైన మధ్యాహ్నానికే పూర్తి నెగటివ్ టాక్ వచ్చింది. 


ఊహించని విధంగా అసలు ఓపెనింగ్స్ కూడా రావని ఎవరూ అనుకోలేదు. ఒక స్టార్ నటించిన సినిమాల్లో తెలుగు ఇండస్ట్రీలోనే అత్యంత తక్కువ కలెక్షన్స్ వచ్చినట్లుగా పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. మోహన్ బాబు నటించిన వందల సినిమాల్లో ఇంతకంటే ఘోరమైన పరాభవం ఇంకొకటి ఉండదని అంటున్నారు. ఫిబ్రవరి 18న తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 300 థియేటర్లలో విడుదలైన సన్ ఆఫ్ ఇండియాకు మార్నింగ్ షో నుంచే నెగటివ్ టాక్ మొదలైంది. మార్నింగ్ షో నుంచే కేవలం 5 శాతం ఓపెనింగ్స్ కూడా రాలేదని లెక్కలు చెప్తున్నాయి. తొలి మూడు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో కేవలం 10 లక్షల గ్రాస్ వచ్చిందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. అంటే షేర్ లెక్కలేస్తే రెంట్ కాదు కదా పార్కింగ్ డబ్బులు కూడా రానట్లే లెక్క. ప్రేక్షకులు థియేటర్స్‌కు రాక, థియేటర్లు ఖాళీగా ఉండడంతో చాలా చోట్ల షోలు కూడా రద్దు చేశారు. కృష్ణా జిల్లాలో మాత్రమే 35 వేల వరకు షేర్ వచ్చిందని తెలుస్తుంది.