Ex Minister Yadlapati Venkata Rao: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంకటరావు (Yadlapati Venkata Rao) కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 102 ఏళ్లు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ సభ్యుడిగా మంత్రిగా సేవలందించారు. హైదరాబాద్‌లోని యడ్లపాటి కుమార్తె నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. గుంటూరు (Guntur) జిల్లా అమర్తలూరు మండలం మూలపాడు గ్రామంలో 1919లో జన్మించారు.


1967 గుంటూరు జిల్లా వేమూరు నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు. 1978లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే ఏడాదిలో వేమూరు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 1978-80 మధ్య మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేశారు. టీడీపీ రాకతో 1983లో ఆ పార్టీలో చేరారు. 1995లో గుంటూరు జడ్పీ ఛైర్మన్‌గా, 1998లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. వయోభారం కారణంగా 2004 నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.


యడ్లపాటి వెంకట్రావు తనయుడు కొద్ది నెలల క్రితమే చనిపోయారు. ఆయన ఏకైక కుమారుడు యడ్లపాటి జయరాం గత ఏడాది ఏప్రిల్‌లో కన్నుమూశారు. జయరాం తన తండ్రి వెంకట్రావులాగే న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు.


మూడు రాజధానుల (3 Capitals Issue)పైనా యడ్లపాటి స్పందన
ఏపీలో మూడు రాజధానుల (AP 3 Capitals Issue) అంశంపైన కూడా యడ్లపాటి వెంకట్రావు గతంలో స్పందించారు. సీఎం జగన్ ఒక్కడు మాత్రమే పరిపాలన వికేంద్రీకరణ కోరుకుంటున్నారని.. ఎక్కడా ప్రభుత్వం మారితే రాజధానులు మార్చలేదని ఆయన గుర్తుచేశారు. పరిశ్రమల ద్వారానే అభివృద్ధి సాధ్యం తప్ప రాజధానులు వల్ల సాధ్యం కాదని సూచించారు. జగన్ నిర్ణయం వల్ల ఉద్యోగస్తులు, ప్రజలు అంతా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని యడ్లపాటి ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో కమ్మ సామాజిక వర్గం ఎక్కువ అంటున్నారు కానీ అది తప్పని, ఇక్కడ అన్ని కులాలు ఉన్నాయని అన్నారు.


సంగం డెయిరీ (Sangan Dairy) స్థాపన
1977లో గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని పాడిరైతుల సహకారంతో యడ్లపాటి వెంకటరావు సంగం డెయిరీని స్థాపించారు. దీనికి తొలి ఛైర్మన్‌గా కూడా యడ్లపాటి వెంకట్రావు ఛైర్మన్ గా ఉన్నారు. ఆ తరువాతి కాలంలో ధూళిపాళ్ళ వీరయ్య చౌదరి దానికి అధ్యక్షుడు అయ్యారు.