Hyderabad Police: ట్రాఫిక్ ఉల్లంఘనలు (Traffic Violations) చేయడం వల్ల మీకు చలానాలు పడ్డాయా? ఆ వేలకు వేల చలానాలు (Traffic Challans) కట్టలేక సతమతమవుతున్నారా? ఇలాంటి వారికి శుభవార్త. ఆ బకాయిలను కట్టేసేందుకు పోలీసులు బంపర్ ఆఫర్ ప్రకటించారు. కట్టాల్సిన చలానాలపై ఏకంగా 50 నుంచి 90 శాతం డిస్కౌంట్ ప్రకటించారు. ఈ రాయితీ ఉపయోగించుకొని చలాన్లను చెల్లించి కేసుల నుంచి తప్పించుకునే అవకాశం కల్పించారు.. పోలీసులు. హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ (Hyderabad City Police) చట్టాన్ని అనుసరించి ప్రస్తుతానికి రాజధాని పరిధిలో మాత్రమే ఈ ఆఫర్‌ను అమలు చేస్తున్నారు. మార్చి 1 నుంచి 30వ తేదీ వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉండనుంది. 


త్వరలో రాష్ట్రమంతా..
ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్‌ను త్వరలో రాష్ట్రమంతా అమలు చేసే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఇది వర్తింపచేయాలంటే డీజీపీ (Telangana DGP) అప్రూవల్ ఉండాల్సి ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి (DGP Mahender Reddy) సెలవులో ఉన్నారు. ఆయన తిరిగి విధుల్లో చేరిన వెంటనే ఈ సదుపాయాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇలా డిస్కౌంట్ వర్తించేందుకు సంబంధిత చలానా చెల్లింపు వెబ్‌సైట్‌లో కొత్త ఫీచర్‌ను జోడించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో నమోదైన ట్రాఫిక్ ఫైన్‌లకు మాత్రమే ఈ రాయితీ వర్తింపజేయనున్నారు.


డిస్కౌంట్లలో రకాలు
కార్లు, లారీలు వంటి పెద్ద వాహనాల వారికి ట్రాఫిక్ చలాన్‌ లలో (Traffic Challans)  50 శాతం రాయితీ కల్పించారు. బస్సులకు 70 శాతం డిస్కౌంట్ ఇచ్చారు. రెండు చక్రాలు, మూడు చక్రాలు, తోపుడు బండ్ల వారికి ట్రాఫిక్ చలానాల్లో 75 శాతం డిస్కౌంట్ ఇచ్చారు. మాస్కు లేదని రూ.వెయ్యి ఫైన్ పడ్డ వారికి ఏకంగా 90 శాతం రాయితీ ఇచ్చారు. https://echallan.tspolice.gov.in/publicview/  వెబ్‌సైట్‌ ద్వారా బకాయిలను ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు.


తెలంగాణ వచ్చిన నాటి నుంచి రూ.2,671 కోట్ల ఫైన్‌లు
గత ఎనిమిదేళ్లలో 8.79 కోట్ల ఉల్లంఘనలకు సంబంధించి రూ.2,671 కోట్ల విలువైన జరిమానాలు విధించారు. ఇందులో రూ.900 కోట్లే (33 శాతం) వసూలయ్యాయి. మిగిలిన రూ.1,770 కోట్ల మేర వసూలు కోసం తాజాగా రాయితీతో అవకాశం కల్పించారు. కట్టాల్సిన చలాన్లలో బైకర్ల వాటానే అధికం. వీరు చెల్లించాల్సిన మొత్తం రూ.1200 కోట్ల దాకా ఉంది. ఈ బకాయిలకు 75 శాతం రాయితీ వర్తింపజేశారు. అంటే వీరు రూ.300 కోట్లు చెల్లించాలి. మిగతా వాహనాలకు సంబంధించి మరో రూ.200 నుంచి 300 కోట్లు ఉండనుంది. రూ.500 నుంచి 600 కోట్లు వసూలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.