గ్రేటర్ హైదరాబాద్ అధికారులు పన్నుల వసూళ్లలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. వ్యాపార ప్రకటనల పేరుతో కనిపించిన ప్రతీ బోర్డుకు బాధ్యుడ్ని కనిపెట్టి చలాన్ రాసేస్తున్నారు. ఇలా ఓ ఇంటి ఓనర్ తన ఇంటి పోర్షన్ అద్దెకు ఉందని    టూ-లెట్  పాంప్లెట్ అంటిస్తే దాని మీద ఉన్న ఫోన్ నెంబర్ ఆధారంగా అతనికి ఫైన్ వేసి చలాన్ పంపించారు. హైదరాబాద్‌లో రోడ్లుపై, గేట్లపై, హోర్డింగ్‌లపై ప్రకటనలు పెట్టాలంటే అనుమతి తీసుకోవాలి. ఈ అనుమతుల్లేకపోతే ఫైన్ వేస్తారు. ఇలాంటి అనుమతులు లేని ప్రకటనల్ని పట్టుకోవడానికి ప్రత్యేకంగా ఓ టీమును ఏర్పాటు చేశారు.  ఆ టీం పేరు బల్దియా ఎన్ ఫోర్స్ మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అంటే ఈవీడీఎం అన్నమాట. వీరి డ్యూటీ ఏమిటంటే .. రోడ్డు మీదకెళ్లడం.. కనబడిన ప్రకటనల ఫోటోలు తీసి జరిమానాలు విధించండం. చివరికి టూ-లెట్ పోస్టర్లను కూడా వదిలి పెట్టడం లేదన్న మాట.  
 
నిజానికి  ఎన్ ఫోర్స్ మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ని ఏర్పాటుచేసింది.. అవినీతి, అక్రమాలతో పాటు ఆక్రమణలను అరికట్టేందుకు, విపత్తులు సంభవించినపుడు సహాయక చర్యలు చేపట్టేందుకు. ఈ బృందాలు చాలా చోట్ల హైదరాబాద్‌లో కనిపిస్తూనే ఉంటాయి. కానీ  అసలు విధులను పక్కనబెట్టి జరిమానాల పేరుతో హడావుడి చేస్తున్నారు. ఓ చిన్న టూలెట్ బోర్డునే వదిలి పెట్టకుండా ఫైన్‌ కట్టమన్నారంటే ఇక రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకునేవాళ్లని వదిలి పెడతారా..?. దుకాణాలు ముందు బోర్డులు పెట్టుకున్నా అది ప్రకటనే అంటూ వేలు జరిమానా విధిస్తున్నారు. పనిలో పనిగా బెదిరించి కొంత మామూళ్లు కూడా వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  


ఇక్కడ కనిపిస్తున్న చలాన్   ఖైరతాబాద్ సర్కిల్‌లోని ఆనంద్ నగర్ లో ఓ ఇంటి యజమానికి ఇచ్చింది. ఆయన ఈ చలాన్ ప్రభుత్వ గోడల మీద అంటించలేదు.  తన ఇంటి గోడకే అంటించుకున్నారు. కానీ అది వ్యాపార ప్రకటన అని తేల్చి  బోర్డుకు రూ. 2 వేల జరిమానాను విధించాడు. ఒక్క ఆనంద్ నగర్‌లోనే కాదు... ఈ రకంగా నగరవాసులకు ప్రతీ రోజూ చలనాలు వసూలు చేస్తున్నారు. ఈ ఎన్ ఫోర్స్ మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్  ఇప్పటి వరకు రూ. 5 కోట్ల పై చిలుకు జరిమానాలు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. దానికి రెండు, మూడింతలు జరిమానాలు విధించకుండా ఉండేందుకు వసూలుచేసినట్లుగా ఆరోపిస్తున్నారు. తమ ఇంటికే ప్రకటన అంటించుకుంటే ఎందుకు జరిమానా విధించిందనేది చాలా మందికి అర్థం కాని విషయం. కానీ ఎవరూ సమాధానం చెప్పరు. ఇక్కడ దోచుకున్నవాళ్లకి దోచుకున్నంత మరి..!