కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ( కేఆర్‌ఎంబీ )ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించడం వివాదాస్పదమవుతోంది. విశాఖలో ఏర్పాటుకు తాము అంగీకరించబోమని తెలంగాణ కృష్ణా బోర్డుకు స్పష్టమైన లేఖ పంపింది. దానికి కారణంగా విశాఖ కృష్ణా బేసిన్‌లో లేదని లేఖలో తెలిపింది. బేసిన్ ప్రాంతంలోనే బోర్డును ఏర్పాటు చేయడం అవసరమని తెలంగాణ వాదన. 


విభజన చట్టంలో ఏపీకి కృష్ణా, తెలంగాణకు గోదావరి బోర్డులు..! 

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో కృష్ణా, గోదావరి బోర్డులను ఏర్పాటు చేశారు. వాటి కార్యాలయాలను చెరో రాష్ట్రానికి కేటాయించారు. కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఏపీకి.. గోదావరి రివర్ బోర్డ్ తెలంగాణకు కేటాయించారు. ఉమ్మడి రాజధాని కాబట్టి కృష్ణా బోర్డు కూడా మొదట్లో హైదరాబాద్‌లోనే ఏర్పాటయింది. అమరావతిలో రాజధానిని ఖరారు చేసిన తర్వాత కృష్ణా బోర్డును విజయవాడకు తరలించాలని అప్పటి ప్రభుత్వం కేంద్ర జలవనరుల శాఖకు లేఖలు రాసింది.  ఆ ప్రకారం.. కేంద్రం కూడా కొన్ని చర్యలు తీసుకుంది. విజయవాడలో కృష్ణా బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి  కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి  2018లోనే ఆమోదం తెలిపారు. 


విశాఖలో కృష్ణాబోర్డు ఏర్పాటు చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం!


ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిన తర్వాత ..అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా మొదట్లో విజయవాడలోనే కృష్ణాబోర్డు కార్యాలయాన్ని పెట్టాలని కేంద్ర జలశక్తి శాఖకు లేఖలను పంపారు. కానీ ఈ ఏడాది జనవరిలో మనసు మార్చుకుంది. ఈ ఏడాది జనవరి ప్రారంభంలో కేఆర్ఎంబీ హైదారాబాద్ నుంచి కాబోయే కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నానికి తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విజ్ఞప్తి చాలా మందిని ఆశ్చర్యపరిచింది. దీనికి కారణం కృష్ణా బేసిన్‌లో విశాఖ లేదు. అయితే ఏపీ ప్రభుత్వం అడిగిందని కృష్ణాబోర్డు కూడా అంగీకారం తెలిపింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేఆర్‌ఎంబీ కార్యాలయాన్ని విశాఖకు తరలిస్తే అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. దీంతో బోర్డు అధికారులు విశాఖలో రెండు ప్రదేశాలను ప్రాథమికంగా ఎంపిక చేసుకున్నారు. ఈ మేరకు 27న జరగనున్న బోర్డు సమావేశంలో దీన్ని ఎజెండాగా చేర్చారు. 


కృష్ణా బేసిన్‌లోనే బోర్డు కార్యాలయం ఉండాలని తెలంగాణ వాదన..!


ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం విశాఖకు కృష్ణాబోర్డు కార్యాలయం తరలింపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.  కృష్ణా బేసిన దాటి మూడు వందల కిలోమీటర్ల అవతల కృష్ణాబోర్డు ఏర్పాటు చేయడం ఏమిటన్నది తెలంగాణ అధికారుల అభ్యంతరం. తమ వాదనను వారు రాత పూర్వకంగా కృష్ణాబోర్డుకు తెలియచేశారు.  బోర్డులో ఇరు రాష్ట్రాల ఉద్యోగులు, అధికారులు ఉంటారని, వీరు విధు లు నిర్వర్తించడం ఇబ్బందితో కూడుకున్న వ్యవహారమని తెలంగాణ వాదిస్తోంది. కర్నూలు, విజయవాడ, శ్రీశైలంలో ఎక్కడకు తరలించినా.. అభ్యంతరం లేదని కానీ విశాఖ మాత్రం వద్దని తెలంగాణ అంటోంది.