పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. అన్యోన్యంగా ఉంటున్న టైంలో పిడుగులాంటి సంఘటన. సరూర్‌నగర్‌ పరిధిలో జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. బుధవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో కొత్త జంటపై దాడి జరిగింది. ఈ దుర్ఘటనలో భర్త స్పాట్‌లోనే చనిపోయాడు. 


రంగారెడ్డి జిల్లా మర్పల్లికి చెందిన బిల్లారపురం నాగరాజు, మర్పల్లి సమీపంలోని ఘనాపూర్‌ వాసి ఆశ్రిన్‌ సుల్తానా ప్రేమించుకున్నారు. విషయం తెలుసుకున్న ఆశ్రిన్‌ బంధువులు నాగరాజును హెచ్చరించారు. ఆమె వెంట తిరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ప్రమాదాన్ని గ్రహించిన నాగరాజు హైదరాబాద్‌లో ఉద్యోగం వెతుక్కున్నాడు. ఓ కంపెనీలో సేల్స్‌మెన్‌గా చేరాడు. స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకుందామని ఆశ్రిన్‌కు చెప్పాడు. 


అనుకున్నట్టుగానే లైఫ్‌లో స్థిరపడ్డ తర్వాత ఆశ్రిన్‌కు కబురు పెట్టాడు. జనవరిలో ఇంట్లో చెప్పకుండా ఆశ్రిన్ హైదరాబాద్‌ వచ్చేసింది. ఆర్యసమాజ్‌లో జనవరి 31న ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. తమ జాడ ఆశ్రిన్‌  బంధువులకు తెలియకుండా ఉండేందుకు ఉద్యోగం, నివాసాన్ని కూడా మార్చేశారు. 


ఆశ్రిన్, నాగరాజు ఎన్ని ప్లేస్‌లు మారుతున్నా ఆమె బంధువులు వదల్లేదు. వెంటాడుతునే ఉన్నారు. ప్రస్తుతం సరూర్‌నగర్‌లో ఉన్నారని తెలుసుకున్న ఆశ్రిన్ బంధువులు మరోసారి దాడి చేశారు. 


రాజాసింగ్ రియాక్షన్ 


సరూర్‌నగర్ పరువు హత్యపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ప్రేమించి పెళ్లి చేసుకోవడం నాగరాజులు చేసిన తప్పా అని ప్రశ్నించారు. తెలంగాణలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా అని హోంమంత్రిని నిలదీశారు రాజా సింగ్. టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటనలు తరచూ వింటున్నామన్నారు. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ సరిగా ఉందని చెప్పుకోవాలంటే నాగరాజు హత్య వెనుక ఉన్న వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వారికి శిక్ష పడేలా చేయాలన్నారు. ఈ సంఘటనపై ప్రభుత్వం తరఫున హోంమంత్రి స్పందించాలన్నారు రాజా సింగ్ 


బుధవారం రాత్రి నాగరాజు, ఆశ్రిన్ బయటకు వెళ్తుండగా ఆమె సోదరుడు ఇద్దరిపై ఎటాక్ చేశాడు. నాగరాజును అతి కిరాతకంగా అందరూ చూస్తుండానే దాడి చేశాడు. ఇనుపరాడ్‌తో కొట్టి హత్య చేశాడు. 


ఇదంతా చూస్తున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అందరూ చూస్తుండగానే నాగరాజును కొట్టి చంపేశాడు ఆశ్రిన్ సోదరుడు. ఇంతలో పోలీసులు వచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏం జరిగిందో తెలియక షాక్‌లోకి వెళ్లిపోయింది ఆశ్రిన్. నాగరాజు బంధువులు వచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్లారు.