Hyderabad News: హైదరాబాద్‌లోని మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అమానుషం జరిగింది. దాదాపు 16 మంది పిల్లల బట్టలు తీసి నిందితులు విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంగళ్ హాట్ ఏసీపీ ఆర్ సతీశ్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితులను రాహుల్, హరికిరణ్, అమోల్‌గా గుర్తించారు. వారిపై జువైనల్ జస్టిస్ యాక్ట్, ఐపీసీ సెక్షన్లు 324, 506 కింద కేసు నమోదు చేశారు. ఈ ముగ్గురిలో ఒకరు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వద్ద పీఏగా పని చేస్తున్న వ్యక్తి అని ప్రచారం జరుగుతోంది.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొంత మంది బాలురు మంగళ్ హాట్ ప్రాంతం పరిధిలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో మంగళవారం పేకాట ఆడుతున్నారు. అదే ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు వారు పేకాట ఆడుతుండగా, అక్కడికి వచ్చారు. పిల్లల్ని చుట్టుముట్టి, వారిని వెళ్లగొట్టారు. ఈ క్రమంలోనే బట్టలు విప్పించి ప్లాస్టిక్ పైపులతో పిల్లల్ని కొట్టి, గట్టిగా హెచ్చరించారు. ఇంకోసారి ఆ ప్రదేశంలో కనిపిస్తే బాగోదని చెప్పారు. వీరిలో ఓ బాలుడి తల్లి ఈ విషయం గురించి పోలీసులకి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితులను గుర్తించి వారిని అరెస్టు చేశారు.


Also Read: Murder In Hyderabad: హైదరాబాద్‌లో పరువు హత్య- చెల్లెలి భర్తను కిరాతకంగా చంపేసిన సోదరుడు


అయితే, మైనర్ బాలుర పట్ల అమానుషంగా ప్రవర్తించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోకుండా స్థానికంగా ఉన్న బీజేపీ నాయకులు పోలీసులపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసు విచారణలో ఉన్నట్లుగా ఇన్స్పెక్టర్ రవి తెలిపారు.


పేకాట స్థావరాలపై దాడి
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ లో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేసిన ఘటనలో 16 మందిని పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 15 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన బండపల్లి సతీష్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారిలో నగరంలోని వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు ఉన్నట్లుగా తెలుస్తోంది.


Also Read: Weather Updates: తెలంగాణలో తీవ్ర వడగాడ్పులు, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్! ఏపీలో ఈ ప్రాంతాల్లో నేడు వర్షాలు


Also Read: Hyderabad: 16 మంది పిల్లల బట్టలు విప్పించి పైపులతో కొట్టారు - నిందితుల్లో ఒకరు బీజేపీ నేత వద్ద పీఏ?