Rain in Telangana Andhra Pradesh: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఓవైపు ఎండలు మండిపోతుండగా, మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి. నేడు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్ష సూచన ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. దక్షిణ అండమాన్ సముద్రంలో నిన్న ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. దీని ప్రభావంతో మే 6వ తేదీన అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉండగా, ఆ తర్వాతి 24 గంటల్లో మరింత బలపడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. విపరీతమైన ఎండల నేపథ్యంలో ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు ఎల్లో అలర్ట్ జారీ చేశాయి.
కోస్తాంధ్రలో వర్షాలు..
అల్పపీడనం ప్రభావంతో మే 8 వరకు ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలైన ఉమ్మడి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం తూర్పు గోదావరి జిల్లాల్లో, యానాం ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురవనున్నాయి. నేడు ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు ఉండవచ్చని అంచనా వేశారు. ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
తెలంగాణలో ఇలా Telangana Weather Updates
దక్షిణ అండమాన్‌లో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో మే 7 వరకు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కానీ, రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు పైగానే నమోదవుతోంది. మరోవైపు, నేడు ఒకటి లేదా రెండు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అదే సమయంలో చాలా చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు ఉంటాయని పేర్కొంది. ఈ గాలుల వేగం గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగం వరకూ ఉంటుందని అంచనా వేశారు. ఈ మేరకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది.