గ్రూప్‌ 1 నోటిఫికేషన్ తెలంగాణలో సరికొత్త వివాదానికి తెరలేపింది. ఇప్పుడు ఈ నోటిఫికేషన్‌పై బీజేపీ మండిపడుతోంది. ఉర్దూలో రాసుకోవచ్చని చెప్పడాన్ని తప్పుపట్టారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌. ఇలా చేస్తే ఉర్దూ చదివే వాళ్లకు ఎక్కువ ఉద్యోగాలు వస్తాయన్నారు. దీని వెనుక భారీ కుట్ర ఉందంటూ ఆరోపణలు చేశారాయన. 






బండి సంజయ్ చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా తప్పుపడుతోంది టీఆర్ఎస్. గ్రూప్‌ 1 నోటిఫికేషన్ ఆపేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించింది. నిజమాబాద్‌లో మాట్లాడి ఎమ్మెల్సీ కవిత.. బీజేపీ కామెంట్స్‌పై తీవ్రంగా మండిపడ్డారు. విషం చిమ్మి ఓట్లు వేయించుకోవడంలో ఆరితేరిపోయారని.. కానీ తెలంగాణలో ఇలాంటి కుట్రలు సాగవని అన్నారు. ఇలాంటి ఆరోపణలతో నోటిఫికేషన్లు ఆపేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని బీజేపీ ప్లాన్‌గా అమె అభివర్ణించారు. 


భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లోని 22 భాషల్లో ఏ భాషలోనైనా సివిల్ సర్వీస్‌ పరీక్షలు, ఆయా రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసే హక్కు పౌరులకు ఉంటుందని గుర్తు చేశారు తెలంగాణ ప్రణాళిక సంఘం వైస్‌ ఛైర్మన్‌ వినోద్‌. వాస్తవాలు తెలుసుకోకుండా రాజ్యాంగం పట్ల అవగాహన లేకుండా బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ మాట్లాడారని మండిపడ్డారు. యువతను రెచ్చగొట్టి విద్వేషాలు ఏర్పడేలా మాట్లాడటం విచారకరమన్నారాయన. 


పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్‌కు రాజ్యాంగం పట్ల అవగాహన లేక పోవడం విచారకరమన్నారు వినోద్‌. వాస్తవాలు దాచిపెట్టి ప్రతి అంశాన్ని వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించిన 2014 నుంచి 2022 వరకు జారీ అయిన యూపీఎస్సీ పరీక్షల షెడ్యూల్,  నోటిఫికేషన్లో కూడా ఐ.ఏ.ఎస్., ఐ.పీ.ఎస్., ఐ.ఎఫ్.ఎస్. వంటి ఉద్యోగాల కోసం ఉర్దూలో పరీక్షలు రాస్తున్నారని వినోద్ కుమార్ గుర్తు చేశారు. 


ఉర్దూలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాయడం కొత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదని...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉర్దూలో పరీక్షలు నిర్వహించారని వినోద్ కుమార్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా రాజ్యాంగానికి లోబడి వ్యవహరించాల్సి ఉంటుందని వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ఇకనైనా యువతను రెచ్చగొట్టడం మానుకోవాలని బీజేపీ ఎంపీలకు వినోద్ కుమార్ సూచించారు.