Tension at Telangana BJP office : ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్య కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాల నిమిత్తం నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. పరీక్ష నిర్వహణలో అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. పరీక్ష నిర్వహణలో లోపాలను వ్యతిరేకిస్తూ దేశంలోని పలు రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. తాజాగా హైదరాబాద్‌లోని తెలంగాణ బీజేపీ ఆఫీసు వద్ద శనివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. నీట్ పరీక్షలో భారీ కుంభకోణం జరిగిందంటూ ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు నాంపల్లిలోని బీజేపీ ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగారు. మోదీ డౌన్ డౌన్ అంటూ నినదించారు. దీంతో అక్కడికి చేరుకున్న బీజేపీ కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారికి ప్రతిగా రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కాసేపు ఇరువర్గాల పోటాపోటీ నినాదాలతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంతేకాకుండా ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి బీజేపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలను అక్కడి నుంచి తరలించారు. దీంతో పరిస్థితి కాస్త సద్గుమణిగింది.
అసలు ఏం జరిగిందంటే ?
నీట్ యూజీ 2024 ఎగ్జామ్ ఈ సంవత్సరం మే 5న జరిగింది. దేశ వ్యాప్తంగా 4750 సెంటర్లలో నిర్వహించారు. దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అయితే పరీక్ష రోజు మేఘాలయ రాష్ట్రానికి చెందిన కొందరు స్టూడెంట్లకు తప్పు ప్రశ్నాపత్రాలు అందించారు. వాస్తవానికి పరీక్ష సమయం మూడు గంటలు. పరీక్ష ప్రారంభమైన గంట తర్వాత ఈ విషయాన్ని ఇన్విజిలేటర్‌కు తెలిపారు. దీంతో స్పందించిన అధికారులు వారికి సరైన క్వశ్చన్ పేపర్లు అందజేశారు. వారంతా మిగతా రెండు గంటల్లో ఎగ్జామ్ పూర్తి చేశారు. అయితే వారు కోల్పోయిన గంట సమయానికి పరిహారంగా ఎన్టీయే(NTA) గ్రేస్ మార్కులు కలిపింది. దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 4500 పరీక్ష కేంద్రాల్లో ఆరు కేంద్రాల్లో ఇలా తప్పుడు ప్రశ్నాపత్రాలు సరఫరా అయ్యాయి. ఈ ఆరు కేంద్రాలకు గ్రేస్ మార్కులు ప్రకటించడంతో ర్యాంకుల్లో తేడాలు వచ్చాయి. దీంతో దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.
ఏకంగా 67మందికి 720 మార్కులు
ఈ సారి పరీక్ష ఫలితాల్లో నీట్ చరిత్రలోనే తొలిసారిగా ఏకంగా 67 మందికి 720 కి 720 మార్కులు రావడంతో పరీక్ష నిర్వహణపై అనుమానాలు వెల్లువెత్తాయి. హర్యానాలోని ఒక సెంటర్‌లో పరీక్ష రాసిన ఆరుగురికి ఫస్ట్ ర్యాంక్ రావడం ఆ అనుమానాన్ని మరింత పెంచింది. దీనికి కారణం 1563 మందికి గ్రేస్ మార్కులు కలపడమే కారణమంటూ స్టూడెంట్లు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఓ ఇన్‌స్టిట్యూట్ ఫౌండర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ 1563 విద్యార్థులకు 70 నుంచి 80 మార్కులు కలిపారని ఆయన ఆరోపించారు. సుప్రీంకోర్టులో దాఖలైన పలు పిటీషన్లను అత్యున్నత ధర్మాసనం విచారించింది. దీంతో గ్రేస్ మార్కులు తొలగించి మొత్తం 1563 మందికి మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని కేంద్రం చెప్పడంతో నీట్ అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేశారు.
కేంద్రం పై కేటీఆర్ విమర్శలు
నీట్ పరీక్ష నిర్వహణలో అవకతవకలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్(X) వేదికగా స్పందించారు. ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ ద్వారా విచారణ జరిపించాలని కేటీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించిన ఈ అంశంపై కేంద్రం వెంటనే స్పందించాలన్నారు. నీట్ ఎగ్జామ్‌కు సంబంధించిన కొన్ని వ్యవహారాలు చూస్తుంటే అవకతవకలు జరిగినట్లు స్పష్టంగా అర్థమవుతుందన్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది నీట్ పరీక్షలో 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ రావడం అనుమానాలకు తావిస్తోందన్నారు. కొంతమందికి ఏకంగా 100వరకు గ్రేస్ మార్కులు కలిపారు. అందుకు ఏ విధానం అవలంభించారన్నది చెప్పాలన్నారు.
నీట్ పరీక్ష విషయంలో బీఆర్ఎస్ తరపున కొన్ని ప్రశ్నలు, డిమాండ్లను కేంద్రం ముందుంచారు కేటీఆర్
1) గత ఐదేళ్లలో తెలంగాణ నుంచి ఏ విద్యార్థి కూడా నీట్‌లో టాప్ 5 ర్యాంకులో లేరు. దీనికి కచ్చితంగా నీట్ ఎగ్జామ్‌లో జరుగుతున్న అక్రమాలే కారణంగా మేము నమ్ముతున్నాం.
2) గ్రేస్ మార్కుల కేటాయింపులో అనుసరించిన విధానాన్ని బయటపెట్టాలి.
3) ఈ మొత్తం వ్యవహారంపై ఉన్నత స్థాయి నిపుణుల కమిటీతో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలు, అక్రమాలను బయటపెట్టి నష్టపోయిన విద్యార్థులకు వారి కుటుంబాలకు న్యాయం చేయాలి. అక్రమాలకు పాల్పడిన వారిని శిక్షించాలి.