Medical Jobs in Telangana: తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో 755 ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం భర్తీచేసే పోస్టుల్లో  531 సివిల్ అసిస్టెంట్ సర్జన్, 193 ల్యాబ్ టెక్నీషియన్, 31 స్టాఫ్ నర్సుల పోస్టులు ఉన్నాయి. సివిల్ అసిస్టెంట్ సర్జన్, స్టాఫ్‌నర్స్ పోస్టులకు రాష్ట్ర వైద్యారోగ్య సేవల నియామక బోర్డు (MHSRB) ద్వారా నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. ఇక ల్యాబ్ టెక్నీషియ‌న్ పోస్టులను తెలంగాణ వైద్య విధాన ప‌రిష‌త్ ద్వారా భర్తీ చేయనున్నారు.


ప్రతి వ‌ర్షాకాలం రాష్ట్రంలో డెంగీ, మలేరియా, ఇత‌ర విష జ్వరాలు ఎక్కువగా ప్రబలుతున్నాయి. ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం వివిధ ఆసుపత్రులు, విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై దృష్టిసారించింది. ఈ నేప‌థ్యంలో సివిల్ అసిస్టెంట్ స‌ర్జన్లు, ల్యాబ్ టెక్నీషియ‌న్లు, స్టాఫ్ న‌ర్సు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు విడుద‌ల చేసేందుకు కసరత్తు చేస్తోంది. 


రాష్ట్రవ్యాప్తంగా ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల్లో (PHC) సివిల్ అసిస్టెంట్ స‌ర్జన్ల కొర‌త ఎక్కువ‌గా ఉంది. ఆయా పీహెచ్‌సీల్లోని డిమాండ్‌కు అనుగుణంగా సివిల్ అసిస్టెంట్ స‌ర్జన్ పోస్టులను భర్తీచేయనున్నారు. అదేవిధంగా వ్యాధి నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వహించే ల్యాబ్ టెక్నీషియ‌న్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ల్యాబ్ టెక్నీషియ‌న్ పోస్టుల భ‌ర్తీకి తెలంగాణ వైద్య విధాన ప‌రిష‌త్ (TVVP) త్వర‌లోనే నోటిఫికేష‌న్ జారీ చేయ‌నుంది. అలాగే, వివిధ ఆసుప‌త్రుల్లో రోగుల‌కు సేవ‌లు అందించే స్టాఫ్ న‌ర్సుల పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ మేర‌కు స్టాఫ్ న‌ర్సుల పోస్టుల భ‌ర్తీకి ఎంహెచ్ఎస్‌ఆర్‌బీ (MHSRB) నోటిఫికేష‌న్ జారీ చేయనుంది.


5,348 పోస్టుల భర్తీకి ఈ నెలలోనే నోటిఫికేషన్..
తెలంగాణలో 5,348 పోస్టుల భర్తీకి మార్చి 21న ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. ప్రజారోగ్యం & సంక్షేమం, ఆయుష్, డ్రగ్ కంట్రోల్, డీసీఏ, ఐపీఎం, డీఎంఈ, వైద్య విధాన పరిషత్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇక ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో ఉద్యోగాల భర్తీకి కూడా ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. వైద్యారోగ్య సర్వీసుల నియామక బోర్డు ద్వారా నేరుగా ఉద్యోగాల భర్తీ చేపట్టాలని సూచించారు. ఈ ఉద్యోగాల భర్తీకి ఈ నెలలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది.


మొత్తం ఖాళీల్లో అత్యధికంగా వైద్యవిద్య డైరెక్టర్(డీఎంఈ) పరిధిలో 3,235 పోస్టులను భర్తీ చేయనున్నారు. కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుతో పాటు బోధనాసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నారు. భర్తీ చేసే పోస్టుల్లో 1,988 మంది స్టాఫ్ నర్సులు; 1,014 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు; 764 మంది ల్యాబ్ టెక్నీషియన్లు; 596 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు తదితరాలు ఉన్నాయి. రాష్ట్ర వైద్యారోగ్య సేవలు రిక్రూట్ మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ద్వారా నియామక ప్రక్రియ జరుగుతుంది. మొత్తం ఖాళీల్లో హెడ్ ఆఫ్ డిపార్ట్ మెంట్‌లో 3,235 పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో 1255 పోస్టులు, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ లో 11, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటిక్ మెడిసిన్‌లో34 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. 



మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...