Tiruchanoor Padmavathi Teppotsavam TTD Telugu News | తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు ఐదు రోజుల పాటు ఘనంగా జరుగనున్నాయి. జూన్ 17 నుండి 21వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 7.30 గంటల వరకు అమ్మవారు పద్మసరోవరంలో తెప్పలపై విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఆగమపూజలు అందుకుని భక్తులకు అనుగ్రహం
ఈ ఉత్సవాల్లో శ్రీ అలమేలు మంగమ్మ పద్మసరోవర తీరంలో పాంచరాత్ర ఆగమపూజలు అందుకుని భక్తులను అనుగ్రహిస్తారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు రమణీయంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. తెప్పోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు తిప్పలు, సంసార దుఃఖాలు తొలగి, మోక్షం సిద్ధిస్తుంది. పద్మసరస్సులో బంగారు పద్మం నుండి ఆవిర్భవించిన అలమేలు మంగ జీవకోటికి మాతృమూర్తిగా మారి భవజలధిలో మునిగిపోకుండా రక్షించి, సర్వసౌఖ్యాలు ప్రసాదిస్తారని తెప్పోత్సవాల మనకు సూచిస్తున్నాయి.
ఐదు రోజుల షెడ్యూల్ ఇదే
జూన్ 17వ తేదీ మొదటి రోజు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి తెప్పలపై విహరిస్తారు. ఇక రెండో రోజు జూన్ 18న శ్రీ సుందరరాజస్వామి తెప్పలపై భక్తులకు దర్శనమిస్తారు. చివరి మూడు రోజులు జూన్ 19 నుంచి 21వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పలపై విహరిస్తారు. చివరి 3 రోజుల పాటు పద్మసరోవరంలోని నీరాడ మండపంలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు అమ్మవారికి స్నపనతిరుమంజనం నిర్వహించనున్నారు. అమ్మవారికి జూన్ 20వ తేదీ రాత్రి 8.30 గంటలకు గజవాహనం, జూన్ 21వ తేదీ రాత్రి 8.30 గంటలకు గరుడ వాహనసేవ నిర్వహిస్తారు. తెప్పోత్సవం అనంతరం ప్రతిరోజు ఆలయ మాడ వీధుల్లో అమ్మవారి ఊరేగింపు నిర్వహిస్తారు.
ఆర్జితసేవలు రద్దు :
తెప్పోత్సవాల కారణంగా అమ్మవారి ఆలయంలో ఐదు రోజుల పాటు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, జూన్ 21న లక్ష్మీ పూజను రద్దు చేశారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.
Also Read: రాముడు, భీష్ముడు, పరశురాముడు, శ్రవణకుమారుడు..వీరి ప్రతి అడుగు నాన్నకు ప్రేమతో!