Hyderabad Police News: హైదరాబాద్ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రోడ్డు పై ఒక వ్యక్తి దారుణ హత్య జరిగింది. ఆ వ్యక్తి పై కత్తులతో దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేసిన ఐదుగురు నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి ఆసిఫ్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల సోదరుడిని హత్య చేసినందుకు ప్రతీకారంగానే యువకుడిని చంపినట్లు  పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుండి హత్యకు ఉపయోగించిన కత్తి, ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్య జంట నగరాల్లో సంచలనంగా మారింది. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో  సయ్యద్ తాహెర్ (27), సయ్యద్ ఇమ్రాన్ (24), సయ్యద్ ముజఫర్, సయ్యద్ అమన్, షేక్ జావీద్ ఉన్నారు.


కత్తితో పొడిచి, రాళ్లతో కొట్టి దారుణం.. 
ఈ నెల 13వ తేదీన ఆసిఫ్ నగర్ ప్రాంతంలో  రోడ్డు పై మొహమ్మద్ కుతుబుద్దిన్ అనే 27సంవత్సరాల యువకుడిని దారుణంగా చంపారు.  కత్తి, కర్రలు, బండ రాయితో కొట్టి అతి కిరాతకంగా ఐదుగురు వ్యక్తులు కలిసి హత్య చేశారు. సమాచారం అందుకున్న ఆసిఫ్ నగర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.  


ప్రతీకారంతోనే హత్య
మృతుడు గతంలో ఓ హత్య కేసులో ఉన్నాడు. ఆ హత్యకు ప్రతీకారంగానే ఈ యువకుడిని హతమార్చినట్లు డీసీపీ  స్నేహ మెహ్రా తెలిపారు. అరెస్ట్ అయిన ఐదుగురు నిందితుల్లో A1 సయ్యద్ తహేర్, A2 సయ్యద్ ఇమ్రాన్,  A3 సయ్యద్ అమాన్, A4 సయ్యద్ ముజఫ్ఫార్ A5 షేక్ జావిద్ ఉన్నారు. అరెస్ట్ అయిన వారిలో  ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు.  2023లో ఆసిఫ్‌నగర్‌లోని ఓ బార్ సమీపంలో నిందితులు తాహెర్, ఇమ్రాన్, ముజాఫర్‌ల సోదరుడైన ముజాహెద్‌ను మృతుడు మహ్మద్ కుతుబుద్దీన్ హతమార్చినట్లు డీసీపీ స్నేహ మెహ్రా తెలిపారు. హత్యానంతరం కుతుబుద్దీన్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు.  


ఎలాగైనా మట్టుబెట్టాలని.. 
తాహెర్, అతని సోదరులు ఈ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని భావించారు.  వారి ఇతర బంధువుల సాయంతో హత్యకు పక్కా ప్రణాళిక రచించారు.  గురువారం రాత్రి బహిరంగంగా రోడ్డుపై కుతుబుద్దీన్‌ ను వెంబడించి.. ఛాన్స్ దొరకగానే  అతని పై కత్తులతో, కర్రలతో దాడి చేశారు. గాయపడిన కుతుబుద్దీన్‌ అక్కడి నుంచి తప్పించుకుని తన అన్న రహీం షాపు దగ్గరకు చేరుకున్నాడు. వెంటనే అతడిని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కుతుబుద్దీన్ మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. తాహెర్, ఇమ్రాన్, ముజాఫర్, అర్మాన్, జావీద్‌లను అరెస్ట్ చేశారు.