Tirumala News :  తిరుమలలో దర్శనం టిక్కెట్లను వైసీపీ నేతలు అమ్ముకున్నారని టీడీపీ నేతలు చాలా కాలంగా ఆరోపిస్తూ వస్తున్నారు. తాజాగా ఆనం వెంకటరమణారెడ్డి ఓ లేఖను విడుదల చేశారు. టీటీడీ సభ్యుడిగా ఉన్న చెవిరెడ్డి  భాస్కర్ రెడ్డి రాసిన ఓ సిఫారసు లేఖ మీద 54 బ్రేక్ దర్శనం టిక్కెట్లను, వారికి వసతిని మంజూరు చేయాలని ఉంది. గత ఏప్రిల్ 30వ తేదీన ఆ దర్శనం కేటాయించాలని చెవిరెడ్డి సిఫారసు చేశారు. ఈ సిఫారసు లేఖను టీడీపీ నేత ఆనం రామనారాయణ రెడ్డి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. దర్శనం టిక్కెట్లు అమ్ముకున్నారని మండిపడ్డారు. 


ఒక్కో వీఐపీ బ్రేక్ దర్శన టిక్కెట్ ఖరీదు రూ. పదివేలు 


వీఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్లను వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీవారి ట్రస్ట్ ద్వారా రూ.పది వేలకు అమ్మడం ప్రారంభించారు. టిక్కెట్ ధర ఐదు వందలే అయినప్పటికీ శ్రీవాణి ట్రస్ట్ కు పదివేల విరాళం ఇస్తే ఆ టిక్కెట్ అమ్ముతారు. దాని ద్వారా వీఐపీ బ్రేక్ దర్శనం తో పాటు వసతి కల్పిస్తారు. ఇప్పుడు చెవిరెడ్డి ఇలా యాభై నాలుగు మందికి ఉచిత బ్రేక్ దర్శనం కల్పించాలని సిఫారసు చేయడం వల్ల.. ఐదు లక్షల నలబై వేల రూపాయలు లాస్ అవుతాయి. ఇవన్నీ చెవిరెడ్డి వసూలు చేశారనేది ఆనం రామనారాయణరెడ్డి ఆరోపణ. ఇది  ఒక్క లేఖేనని.. గత ఐదేళ్లుగా ఎన్నో సార్లు ఇలాంటి లేఖలు రాశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.


ఒక్క సిఫారసు లేఖ  ద్వారా 54 మందికి ఫ్రీ టిక్కెట్లు, వసతి                   


టీటీడీ బోర్డు సభ్యుడిగా కూడా చెవిరెడ్డి ఉన్నారు. తుడా అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ చైర్మన్ గా ఆయనకు ఎక్స్ అఫీషియో హోదాలో బోర్డు సభ్యత్వం దక్కింది. ఆయన దానిని దర్శనాల టిక్కెట్లకు అమ్ముకోవడానికి ఉపయోగించుకున్నారని ఆ లేఖ ద్వారా ఆనం  వెంకటరమణారెడ్డి ఆరోపించినట్లయింది. ఆనం వెంకట రమణారెడ్డి టీటీడీ వ్యవహారాలపై కొద్ది రోజులుగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈవో ధర్మారెడ్డి అవినీతికి పాల్పడ్డారని.. దేవుడి సొమ్మును భూమన కరణాకర్ రెడ్డి కమిషన్లు తీసుకుని దారి మళ్లించారని ఆరోపణలు గుప్పించారు. టీడీపీ ప్రభుత్వం రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 


టీడీపీ నేతల తీవ్ర ఆరోపణలు                                        


టీడీపీ ప్రభుత్వం రావడంతో ఇప్పుడు ఇలాంటి దర్శనం లేఖలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. మంత్రి రోజా కూడా దాదాపుగా ప్రతి వారం శ్రీవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఆమెతో పాటు కనీసం పాతిక మంది స్పెషల్ దర్శనం చేసుకుంటూ ఉంటారని.. వారందరి వద్ద ఆమె డబ్బులు వసూలు చేస్తారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు సిఫారసు లేఖ బయటపడటంతో..  టీడీపీ నేతలు విచారణ జరిపిస్తారేమో చూడాల్సి ఉంది.