PM Modi Meloni Selfie: సోషల్ మీడియాలో #Melodi హ్యాష్‌ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీలో జరిగిన G7 సదస్సుకి హాజరయ్యారు. అక్కడ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మెలోని మోదీతో సెల్ఫీ తీసుకున్నారు. సెల్ఫీ వీడియో కూడా రికార్డ్ చేశారు. ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. పైగా "Hi friends, from #Melodi" అని ఆ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆ ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు. కొందరు మీమ్ వీడియోలూ చేసి పోస్ట్ చేస్తున్నారు.





బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ ఈ ఫొటోపై స్పందించారు. మహిళలకు మోదీ ఎప్పటికీ ఇలాగే మద్దతుగా ఉంటారని ప్రశంసల జల్లు కురిపించారు. మోదీని మెలోని అంతగా అభిమానించడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదని అన్నారు. మెలోని షేర్ చేసిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి ఇదంతా రాసుకొచ్చారు కంగనా రనౌత్. 


"మహిళలకు మద్దతునివ్వడం వాళ్లకు అండగా ఉండడం ప్రధాని మోదీజీలో ఉన్న గొప్ప లక్షణాల్లో ఒకటి. మహిళలు ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆయన ఆకాంక్షిస్తారు. ఇటలీ ప్రధాని మెలోని మోదీని అంతగా అభిమానించడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. అది మోదీలో ఉన్న గొప్ప క్వాలిటీ"


- కంగనా రనౌత్, బీజేపీ ఎంపీ



మూడోసారి ప్రధాని అయ్యాక మోదీ తొలి విదేశీ పర్యటన ఇదే. G7లో భారత్ సభ్య దేశం కాకపోయినా ఆహ్వానం అందింది. గతంలోనూ ఫ్రాన్స్‌లో జరిగిన G7 సదస్సుకి మోదీ హాజరయ్యారు. ఈ సారి కూడా హాజరైన ఆయన కీలక చర్చలు జరిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో పాటు మేక్రాన్, రిషి సునాక్‌తోనూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆయా దేశాలతో ద్వైపాక్షిక బంధాన్ని బలపరుచుకునే దిశగా చర్చించారు. పలు కీలక రంగాల్లో పరస్పర సహకారానికి చొరవ చూపించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. సదస్సులో ఏర్పాట్లు చాలా గొప్పగా చేశారని ఇటలీ ప్రధాని మెలోనిపై ప్రశంసలు కురిపించారు. ఇటలీతో మైత్రిని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రానున్న తరాలకు మంచి భవిష్యత్ అందించే దిశగా చర్చలు జరిగినట్టు వివరించారు. 






Also Read: G7 Summit: స్మైల్ ప్లీజ్, G7 సమ్మిట్‌లో మెలోని మోదీ స్పెషల్ సెల్ఫీ - ఫొటో వైరల్