Telangana Congress Chief Revanth Reddy: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వంపై సెటైర్ల మీద సెటైర్లు వేశారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) చేసిన కామెంట్లపై వ్యంగ్యంగా స్పందించారు. ఇస్తాంబుల్ అన్నారు, చికాగో అన్నారు, విశ్వనగరం అని గప్పాలు కొట్టారంటూ రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ లో వర్షాలు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో వివరిస్తూ ప్రముఖ సోషల్ మీడియా ఎక్స్ లో వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేశారు.
హైదరాబాద్ విశ్వనగరం అంటూ కోట్లు పెట్టి ప్రచారాలు చేసినా కానీ, చినుకు పడితే వణుకు వస్తోందని, అడుగు బయట పెడితే గల్లంతు కావడం ఖాయమంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. కేసీఆర్ నాయకత్వంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మునగడం అయిపోయిందని, ఇక హైదరాబాద్ మునుగుడు షురూ అయిందంటూ విమర్శలు గుప్పించారు. వర్షాకాలం అదే గోస, చలికాలం కూడా అదే వరుస అంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వేల కోట్ల ఖర్చు ఫలితం ఇదేనా అన్న ఆయన, కమిషన్ల పేరుతో మొత్తం మీరే మేసేస్తే, ఇక మార్పెక్కడిది ? అని ప్రశ్నించారు. అందుకే మార్పు కావాలి ! కాంగ్రెస్ రావాలి ! అంటూ ట్వీట్ చేశారు. హైదరాబాద్ లో కొద్ది పాటి వర్షం కురిస్తే రోడ్లు ఎలా మారిపోతాయో వివరిస్తూ ఫోటోలు, వీడియోలు ఎక్స్ లో పోస్ట్ చేశారు.