Reliance Retail's Swadesh Store at Alcazar Mall in Hyderabad: రిలయన్స్ సంస్థ ‘స్వదేశ్’ పేరుతో (Swadesh store) కొత్త స్టోర్‌ను తెరిచింది. దేశంలోనే ఈ స్వదేశ్ తొలి స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఉన్న అల్కాజార్ మాల్‌లో (Alcazar Mall) స్వదేశ్ స్టోర్‌ను రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీ (Nita Ambani) బుధవారం (నవంబర్ 8) ప్రారంభించారు. ఈ స్వదేశీ స్టోర్ అతి పెద్ద ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ స్వదేశ్ స్టోర్ గా సంస్థ (Reliance News) చెబుతోంది. స్వదేశ్ స్టోర్ (Swadesh store) ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాంచరణ్ - ఉపాసన దంపతులు, నమ్రతా శిరోద్కర్, మంచు లక్ష్మి, క్రీడాకారిణులు పీవీ సింధు, సానియా మీర్జా తదితరులు పాల్గొన్నారు.
జ్యోతి ప్రజ్వలన అనంతరం నీతా అంబానీ (Nita Ambani) మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ అంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు. మొట్టమొదటి రిలయన్స్ రిటైల్ స్టోర్‌ను కూడా హైదరాబాద్‌లోనే ప్రారంభించామని చెప్పారు. స్వదేశ్ అనేది భారతీయ సంప్రదాయ కళలు, కళాకారులను ప్రతిబింబిస్తుందని అన్నారు. దేశానికి గొప్ప వారసత్వం, చరిత్ర ఉందని అన్నారు. ‘‘మేం 4000 కంటే ఎక్కువ వివిధ రకాల కళలు, చేతిపనులు ఇంకా 70 లక్షల కంటే ఎక్కువ మంది కళాకారులకు వేదికగా ఉన్నాం. ప్రపంచంలో ఎక్కడా వైవిధ్యం లేదు. కాబట్టి, స్వదేశ్ భారతదేశంలోని ఈ కళాకారులందరిని ప్రతిబింబిస్తుంది. వారు నిజంగా మన దేశం గర్వించదగినవారు’’ అని అన్నారు.
హైదరాబాద్ గురించి మాట్లాడుతూ.. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ జట్టు కూడా ఇక్కడ రెండు టైటిల్స్ గెలిచిందని అన్నారు. హస్త కళలను ఆదరించడం, కళాకారులను ప్రోత్సహించడంలో భాగంగానే స్వదేశ్ స్టోర్‌ను ఏర్పాటు చేశామని నీతా అంబానీ తెలిపారు.
ఒలింపిక్స్ పైనా కీలక వ్యాఖ్యలు
‘‘40 సంవత్సరాల తర్వాత భారతదేశంలో ఒలింపిక్స్ సెషన్‌ను నిర్వహించే అవకాశం మనకు లభించింది. ఈ చారిత్రాత్మక సెషన్‌లో క్రికెట్‌ను ఒలింపిక్ క్రీడగా ప్రకటించారు. అదీకాక భారతదేశంలో ప్రపంచ కప్ జరుగుతున్నప్పుడు దానిని ప్రకటించడం శుభపరిణామం. 2030లో యూత్ ఒలింపిక్స్, 2036లో సమ్మర్ ఒలింపిక్స్ కోసం భారతదేశం వేలం వేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ముఖ్యంగా మన దేశంలోని యువ తరం కోసం ఇది ఎంతో ఉపకరిస్తుంది. దీని కోసం నేను ఎదురుచూస్తున్నాను.’’ అని అన్నారు.