తెలంగాణకు చెందిన సీనియర్ లీడర్‌ కొత్తకోట దయాకర్‌రెడ్డి తుదిశ్వాస విడిచారు. కొద్దికాలంగా  అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించి ఈ తెల్లవారుజామును మృతి చెందారు. 


మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలం పర్కాపురం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన కొత్తకోట దయాకర్‌రెడ్డి టీడీపీ తరఫున మూడు సార్లు ఎమ్మెల్యేలగా గెలిచారు. అమరచింత నుంచి రెండుసార్లు మక్తల్‌ నుంచి మరోసారి విజయం సాధించారు. 


కొత్తకోట దయాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు. 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అమరచింత నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ నియోజకవర్గం  ప్రస్తుతం దేవరకద్ర నియోజకవర్గంగా మారింది. 1994లో, 1999లో విజయం సాధించారు. .


కొత్తకోట దయాకర్ రెడ్డి 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్ధి స్వర్ణ సుధాకర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2009లో మక్తల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.  దయాకర్‌రెడ్డి మృతి పట్ల తెలంగాణ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


మక్తల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి గారి మృతి పట్ల తెలుగుదేశం పార్టీ సంతాపం ప్రకటించింది. మహబూబ్‌నగర్ జిల్లాలోని పర్కపురానికి చెందిన దయాకర్‌రెడ్డి అమరచింత నియోజకవర్గానికి రెండుసార్లు, మక్తల్ నియోజకవర్గానికి ఒకసారి ప్రాతినిథ్యం వహించారని పేర్కొంటూ ట్వీట్ చేసింది. 






కొత్తకోట దయాకర్‌రెడ్డి మృతిపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన  మరణం చాలా బాధ కలిగించింది అని అన్నారు. " మాజీ ఎమ్మెల్యే, నా ఆప్తుడు కొత్తకోట దయాకర్ రెడ్డి అకాల మరణం బాధాకరం. పాలమూరు జిల్లా నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి." అని ట్వీట్ చేశారు. 






బీజేపీ లీడర్‌ విష్ణువర్థన్ రెడ్డి కూడా సంతాపం తెలిపారు."తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యుడు కొత్త కోట దయాకర్ రెడ్డి ఈ రోజు పరమపదించడం బాధాకరం. మృతి చెందడం పట్ల నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. వారి ఆత్మకు శాంతిని చేకూర్చాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. అని మెసేజ్ పోస్టు చేశారు.