Telangana Singer Gaddar: తల్లి నుంచి వారసత్వంగా వచ్చిన జానపదంతో ఎందరినో కదిలించాడు జానపద గాయకుడు గద్దర్. తన ఆటపాటలతో ఆలోచనలు రేకెత్తించారు. తన గళంతోనే సమస్యలపై పోరాటాన్ని సాగించారు. ఉస్మానియా ఇంజినీరింగ్ కళాశాలలో విప్లవ పంథాను ఎంచుకుని పాటలతో జనజీవన స్రవంతిలోకి వచ్చారు. తుదిశ్వాస విడిచే వరకు తన పాటలతో చైతన్యం కల్పించారు. తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర కాంక్షను, పోరాట పటిమను మేల్కొలిపారు. ఆయన పాటలు ఉద్యమానికి కొత్త రూపును ఇచ్చి ముందుకు తీసుకెళ్లాయి. ఉద్యమ సమయంలో గద్దర్ పాట లేని కార్యక్రమం ఉండేది కాదు. అంతలా ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు గద్దర్.
గద్దర్ అనే పేరు ఎలా వచ్చిందంటే..
మెదక్ జిల్లా తూప్రాన్‌లో జన్మించారు గద్దర్. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ చేశారు. ఢిల్లీ దర్బార్ హోటల్‌లో ప్రతి రోజూ 2 గంటల పాటు సర్వర్ గా పని చేస్తూ చదువుకునేవారు. దళిత్ పాంథర్, నక్సల్ బరీ ఉద్యమాల స్ఫూర్తితో ఇంజినీరింగ్ చదువును మధ్యలోనే ఆపేసి ఉద్యమాల బాటపట్టారు. 1969లో తెలంగాణ ఉద్యమంలో జైలుకెళ్లారు. ఉద్యమంలో ఉన్నప్పుడు రచనలపై తన పేరు రాయాల్సి వచ్చినప్పుడు.. గుమ్మడి విఠల్ రావు అనే తన అసలు పేరును కాకుండా స్వాతంత్య్ర పోరాటంలో గదర్ (తిరుగుబాటు) పార్టీ పేరును స్ఫూర్తిగా తీసుకుని గదర్ అనే పేరు పెట్టారు. కానీ ప్రింటింగ్ మిస్టేక్ వల్ల గదర్ కాస్త గద్దర్ గా ప్రింట్ అయింది. అప్పటి నుంచి గద్దర్ అనే పేరును కొనసాగుతూ వచ్చింది.
ఎత్తిపోతల పథకం తెచ్చిన గద్దర్..
తను పుట్టిన తూప్రాన్ కు ఏదైనా చేయాలని ఎప్పుడూ తపించేవారు గద్దర్. కిష్టాపూర్ హల్దీవాగుపై ఎత్తిపోతల పథకం నిర్మించాలని గద్దర్ కల. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావుల దృష్టికి తీసుకెళ్లారు. అలా హల్దీవాగుపై ఎత్తిపోతల పథకం నిర్మాణం కావడంతో తూప్రాన్ పెద్దచెరువును నీటితో కళకళలాడింది.
పరిటాల శ్రీరాములుతో కలిసి అజ్ఞాతం
ఎమర్జెన్సీ సమయంలో నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో నక్సల్ నాయకుడు పరిటాల శ్రీరాములుతో కలిసి అజ్ఞాతంలో గడిపారు. 1985లో సాంస్కృతిక ఉద్యమం నడిపించారు. 1990 దాకా అజ్ఞాతంలో ఉంటూనే ఉద్యమ పోరు సాగించారు. 1990 లో జనజీవన స్రవంతిలోకి వచ్చారు. 1996 లో తెలంగాణ జనసభ లో పాల్గొన్నారు. 2002 లో నక్సలైట్ల ప్రతినిధులుగా వరవరరావుతో కలిసి గద్దర్ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. గద్దర్ ను ప్రజా యుద్ధనౌక (పీపుల్స్ వార్‌షిప్) అని 1989 లో ఒక సంపాదకుడు సంబోధించగా.. ఆ తర్వాత అదే తన బిరుదుగా మారిపోయింది.
Also Read: Viral Video: ఫ్లైట్‌లో AC పని చేయక నరకం చూసిన ప్రయాణికులు, టిష్యూలు పంచిన ఎయిర్‌హోస్టెస్
విదేశాల్లో తన గళం వినిపించలేకపోయిన గద్దర్
గద్దర్ కు విదేశాల్లోని ఎన్నో అభ్యుదయ, సాంస్కృతిక సంఘాల నుంచి ఆహ్వానం వచ్చినా ఎక్కడికి వెళ్లలేకపోయారు గద్దర్. 1997లో ఆయనపై కాల్పులు జరిగ్గా.. 6 బుల్లెట్లు శరీరంలోకి చొచ్చుకుపోయాయి. 5 బుల్లెట్లను తొలగించగా.. వెన్నుపూసలో ఉన్న మరో బుల్లెట్ తొలగిస్తే ప్రాణాలకే హాని ఉంటుందని చెప్పి దానిని అలాగే ఉంచేశారు. అయితే ఎయిర్ పోర్టులకు వెళ్లిన ప్రతీసారి స్కానింగ్ లో బుల్లెట్ కనిపించేది. దీనిపై అధికారులకు సమాధానం చెప్పడంలో గద్దర్ ఇబ్బంది పడటం వల్ల అనుమతి లభించేది కాదు. శరీరంలో బుల్లెట్, కేసులు పాస్ పోర్టు జారీకి అడ్డంకిగా మారాయి. అలా విదేశాల నుంచి ఎన్ని ఆహ్వానాలు వచ్చినా విమానం ఎక్కి విదేశాలకు వెళ్లలేకపోయారు.
చేపల కూరంటే గద్దర్ కు ఎంతో ఇష్టం
విశాఖలో దొరికే తాజా చేపలతో వండే కూరంటే గద్దర్ కు ఎంతో ఇష్టం. విశాఖ వచ్చిన ప్రతీసారి ప్రజాకవి వంగపండు ప్రసాదరావు ఇంట్లో తనకిష్టమైన చేపలకూరను వండించుకుని తినేవారు. విశాఖ వస్తే హోటల్ లో ఉండటానికి ఇష్టపడేవారు కాదు. బావగా పిలుచుకునే వంగపండు ఇంట్లోనే ఉండేవారు.