Minister Kishan Reddy: అకాల వర్షాలతో రాష్ట్రంలోని రైతులు తీవ్రంగా నష్టపోతుంటే.. వారిని ప్రభుత్వం ఆదుకోవడం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో పంటల బీమా పథకం అమలు చేయడం లేదని విమర్శలు గుప్పించారు. ఆదివారం హైదరాబాద్ లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు. కేంద్ర సర్కారు ఏం చేస్తుందని విమర్శలు చేయడం తప్ప, ప్రజల కష్టాలను ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకపోవడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు.
'రాష్ట్రాన్ని సలహాదారులకు అప్పగించారు'
ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని సలహాదారులకు అప్పగించారని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ లో చేరికల గురించి మాట్లాడిన కిషన్ రెడ్డి.. బీఆర్ఎస్ పార్టీలో తలమానినోళ్లు చేరుతున్నారని ఎద్దేవా చేశారు. ఫ్లెక్సీల్లో వేసుకుంటే దేశ్ కి నేత కాలేరని అన్నారు. కేసీఆర్ ఎకరాకు 10 వేలు మాత్రమే ఇస్తున్నారని, మోదీ సర్కారు ఎకరాకు కేవలం ఎరువుల సబ్సిడీతోనే 18 వేల 254 రూపాయలు ఇస్తోందని పేర్కొన్నారు. కేసీఆర్ ఎరువులు ఉచితంగా ఇస్తానని హామీ ఇచ్చారని, ఆ హామీ ఏమైందో చెప్పాలని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న తరుణంలోనూ ఎరువుల ధరలు పెరిగినా రైతులపై అదనపు భారం వేయడం లేదని చెప్పుకొచ్చారు. ప్రతీ బస్తా మీద ధరలు ముద్రిస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఇచ్చిన మాట కేసీఆర్ ఎందుకు నిలబెట్టుకోవడం లేదని నిలదీశారు. సీఎం కేసీఆర్ తీరు గురువింద గింజ సామెతలా ఉందని విమర్శించారు. ఉట్టికి ఎగురలేని వారు ఆకాశానికి ఎగిరినట్లు కేసీఆర్ వైఖరి ఉందని ఎద్దేవా చేశారు. డిజిటల్ ట్రాన్సక్షన్ లో భారత్ నంబర్ వన్ గా నిలిచిందని చెప్పుకొచ్చారు.
పంట సాయంగా రైతులకు ఎకరానికి 10 వేల రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రం కేవలం ఎరువుల రాయితీ రూపంలోనే ఒక్కో రైతుకు ఎకరానికి ఏడాదికి రూ. 18 వేలు ఇస్తోందని వివరించారు. అవి కాకుండా ఇతర రాయితీలతో పాటు అదనంగా మరో రూ. 6 వేలు సాయం చేస్తున్నట్లు తెలిపారు. పంట సాయం పేరుతో ఎకరాకు రూ. 10 వేలు ఇస్తున్నామని చెప్పుకుంటున్న కేసీఆర్.. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయినా పరిహారం ఇవ్వడం లేదని విమర్శించారు.
'ముఖ్యమంత్రికి తెలంగాణ రాష్ట్ర పరిపాలనపై శ్రద్ధ లేదు. సలహాదారులకు అప్పగించారు. పాలనను అధికారులకు కాకుండా సలహాదారులకు అప్పగించి మహారాష్ట్రలో బీఆర్ఎస్ కార్యకలాపాలపై దృష్టి పెట్టారు. బీఆర్ఎస్ బ్రాంచ్ ను మహారాష్ట్రంలో పెట్టుకుని ఉదయం నుండి రాత్రి వరకు పార్టీ చేర్చికలపైనే శ్రద్ధ పెట్టారు. ఏ తలమాసినోళ్లనైనా చేర్చుకోండి మాకు అభ్యంతరం లేదు. కానీ రాష్ట్ర పాలన, రైతులు, టీఎస్పీఎస్సీ పరిస్థితిని గాలికి వదిలేసి దేశ్ కి నేత కావాలనుకుంటున్నారు. ఫ్లెక్సీలపై దేశ్ కి నేత అని రాసుకుంటే ఎవరూ కాలేరు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోంది' అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.