Priyanka Gandhi Telangana Visit: కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ఆ పార్టీ నాయకుల్లో ఫుల్ జోష్ తీసుకువచ్చింది. ఓటమి తర్వాత ఓటమి ఎదుర్కొంటున్న కాంగ్రెస్ శ్రేణులకు ఈ విజయం ఎక్కడలేని ఉత్సాహాన్ని ఇచ్చింది. దీంతో తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ తన కార్యక్రమాల జోరు పెంచుతోంది. రాష్ట్రంలో ఒకదాని తర్వాత ఒకటి వరుసగా కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమాలకు ఏఐసీసీ అగ్రనాయకులు హాజరయ్యేలా ప్రణాళికలు వేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో మరోసారి సభ నిర్వహించేందుకు రాష్ట్ర నాయకత్వం సిద్ధమవుతోంది.


జూన్ చివరి వారంలో లేదంటే జులై మొదటి వారంలో ప్రియాంక సభ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ప్రియాంక గాంధీ పాల్గొన్న సభలో యూత్ డిక్లరేషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈసారి నిర్వహించబోయే సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ సభను మెదక్ జిల్లాలో నిర్వహించేందుకు టీపీసీసీ ప్లాన్ చేస్తోంది. అలాగే వరుస కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో ఉండేలా పార్టీ ప్రణాళికలు రచిస్తోంది.


గ్రామగ్రామానా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు


జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణపై సోమవారం గాంధీభవన్ లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రతి గ్రామంలో ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే నిర్ణయించింది. అలాగే రాష్ట్ర స్థాయిలో నిర్వహించే కార్యక్రమానికి ఏఐసీసీ ముఖ్య నేత ఒకరిని పిలవాలని అనుకుంటున్నారు. రేపు జరగబోయే సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. బీసీ, మహిళా,  ఎస్సీ, ఎస్టీ తదితర డిక్లరేషన్లపైనా, భవిష్యత్ కార్యక్రమాలపైనా రాష్ట్ర నాయకులు చర్చిస్తారు. 


జీవో 111 రద్దును పునఃపరిశీలించాలి


తెలంగాణలో జీవో 111 రద్దు నిర్ణయంపై ఎమ్మెల్సీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కోసమే జీవో 111 రద్దు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. జీవో 111పై వేసిన కమిటీ రిపోర్టును బహిర్గతం చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ముందుగానే రైతుల నుండి భూములు కొని ఆ తర్వాతే జీవో 111 రద్దు చేశారని, ఒక్కో నేత వద్ద వందల ఎకరాల భూమి ఉందని జీవన్ రెడ్డి ఆరోపించారు. జీవో 111 పరిధిలో భూముల క్రయ విక్రయాలపై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. 


'రాష్ట్రాన్ని అమ్ముకుపోవడమే లక్ష్యం'


ఆరు నెలల్లో తెలంగాణను అమ్ముకుని పోవాలని కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని, అందులో భాగంగానే జీవో 111ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారని జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ట్రిపుల్ వన్ జీవో పరిధిలోని భూములు అన్నీ రైతుల చేతుల్లో నుండి బడా బడా వ్యాపార వేత్తలు, బీఆర్ఎస్ నాయకుల చేతుల్లోకి వెళ్లిపోయాయని, వారి కోసమే జీవో 111ను రద్దు నిర్ణయం తీసుకున్నట్లు ఆరోపించారు. చెరువులన్నీ కబ్జా చేయడమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని విమర్శించారు. హైదరాబాద్ జంట జలాశయాలను ఎలా కాపాడతారో చెప్పాలని డిమాండ్ చేశారు.