ఎన్టీఆర్ అంటే ఓ వ్యక్తి కాదు, ఓ శక్తి, తెలుగు జాతి స్ఫూర్తి. తెలుగు జాతి ఉన్నంత వరకు వారి గుండెల్లో శాశ్వతంగా ఉంటారు’ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్టీఆర్ పై అభిమానంతో హైదరాబాద్ లో ఇంత మంది రావడం ఓ చరిత్ర అన్నారు. హైదరాబాద్ కూకట్ పల్లిలోని కైతలాపూర్ గ్రౌండ్స్ లో నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చంద్రబాబు పాల్గొన్నారు. తెలుగుజాతి పరిస్థితి ఎన్టీఆర్ కు ముందు, ఎన్టీఆర్ తరువాత అని చెప్పుకోవాలన్నారు. తెలుగు వారికి ఇంత ఖ్యాతిని తీసుకొచ్చిన ఎన్టీఆర్ ను మనం ఎప్పుడూ మరిచిపోకూడదన్నారు. ఎన్టీఆర్ విషయంలో తెలుగుజాతి ఆకాంక్ష ఒకటి మిగిలిపోయిందన్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇచ్చేంత వరకు తెలుగుజాతిగా పోరాడుతూనే ఉందాం, సాధించుకుందామని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉన్న సమయంలో పోరాటంతోనే అంబేద్కర్ కు భారతరత్న వచ్చిందన్నారు చంద్రబాబు.


సినిమా ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఆయన నుంచి స్ఫూర్తి తీసుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా మన ఖ్యాతిని చాటిచెప్పిన నేత ఎన్టీఆర్ అని చంద్రబాబు పేర్కొన్నారు. అమెరికాలో హెరిటేజ్ గా ఎన్టీఆర్ కు గుర్తింపు ఇస్తూ ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని మే 28ను తెలుగు హెరిటేజ్ డే గా ప్రకటించారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ మారుమూల గ్రామంలో పుట్టి, పాలు అమ్మి తరువాత స్కూల్ కు వెళ్లి చదువుకున్నారంటే ఎన్టీఆర్ పట్టుదల మీకు తెలుస్తుందన్నారు. కొన్ని వేల మందిలో ఉమ్మడి మద్రాసులో రిజిస్ట్రార్ జాబ్ తెచ్చుకున్నారు. కానీ లంచాలు తీసుకోవడం చూసి, అది నచ్చక ఈ ఉద్యోగం నాకొద్దు అని చెన్నైకి వెళ్లారని గుర్తు చేశారు. శ్రీక్రిష్ణుడు, రాముడు, వెంటకటేశ్వరుగా ఆ పాత్రలు పోషించాలంటే భవిష్యత్తులో ఎవరికి సాధ్యం కాదు. దటీజ్ ఎన్టీఆర్. 
Also Read: NTR Centenary Celebrations Jr NTR : శకపురుషుని శత జయంతి ఉత్సవాలు - రావడం లేదని చెప్పిన ఎన్టీఆర్, ఎందుకంటే?


సినిమాలు చేస్తూ హ్యాపీగా ఉన్న సమయంలో రాయలసీమలో కరువు వస్తే, జోలె పట్టి చందాలు వసూలు చేసి కరువు నివారణ సహాయ నిధి ఇచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్. చైనాతో యుద్ధ సమయంలో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి విరాళాలు సేకరించారాయన. దివిసీమ ఉప్పెనతో విధ్వంసం జరగడంతో తోటి నటులతో కలిసి విరాళాలు సేకరించి అందించిన వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తుచేశారు. అయితే తనకు ఇంత ఇచ్చిన తెలుగువారికి ఏదైనా మంచి చేయాలని భావించి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన తీసుకొచ్చిన పథకాలు ప్రజల్లో నిలిచిపోయి యుగ పురుషుడు అయ్యారు. ఎన్నో లక్షల మంది సామాన్యులతో పాటు రాజకీయాలకు అతీతంగా ఎన్టీఆర్ కు జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నారు. 



ఎన్టీఆర్ ఆయన కుటుంబానికి చెందని వ్యక్తి కాదు. తెలుగు జాతి ఆస్తి. మూడు అక్షరాల మహా శక్తి. మన అందరికీ స్ఫూర్తి అన్నారు చంద్రబాబు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వచ్చే ఏడాది 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్న కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. గతంలో దేశంలోనే మనల్ని మద్రాసి అని పిలిచేవాళ్లు. కానీ నేడు అమెరికాలో ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని తెలుగు హెరిటేజ్ డే గా నిర్వహిస్తున్నారంటే ఆ మహనీయుడి గొప్పదనం అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలు కాపాడుకోవడం కోసం మనం ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉండాలన్నారు.