Telangana Police Allowance: తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర పోలీసులకు షాక్ తగిలింది. ఇప్పటివరకూ ఇస్తున్న 15 శాతం ప్రత్యేక అలవెన్స్‌ను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానిస్టేబుళ్ల నుంచి ఎస్సై, సీఐల వరకు ఇచ్చే ఈ ప్రత్యేక అలవెన్స్‌ను పలు జిల్లాల్లో రద్దు చేశారు. గతంలో హైదరాబాద్ మినహా మిగిలిన ఉమ్మడి తొమ్మిది జిల్లాల్లో పోలీసులకు ఈ అలవెన్స్ ఇచ్చేవారు.
మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉంటున్న సమయంలో శాంతిభద్రతల విభాగం, ఏఆర్, ప్రత్యేక పోలీస్‌విభాగాల్లో పనిచేసే పోలీసులకు గత నెల వరకు పదిహేను శాతం స్పెషల్ అలవెన్స్ ఇచ్చేవారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ నెల నుంచి కొన్ని జిల్లాలకు పరిమితం కానుంది. కొన్ని జిల్లాల్లోని కానిస్టేబుల్, ఎస్ఐ, సీఐలు మాత్రమే ఇకనుంచి స్పెషల్ అలవెన్స్ అందుకోనున్నారు. జిల్లాల్లోని పోలీస్ స్టేషన్‌లకు ఉన్నతాధికారులు సమాచారం అందించారు. త్వరలో దీనిపై ప్రకటన వెలువడనుంది. మావోయిస్టు కార్యకలాపాలు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబితా ఎఫెక్ట్..
11 రాష్ట్రాల్లోని 90 జిల్లాలను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించినట్లు కేంద్ర హోంశాఖ ఇటీవల వెల్లడించింది. భద్రత సంబంధిత వ్యయం (SRE) పథకం కింద కేంద్రం రాష్ట్రాలకు నిధుల్ని విడుదల చేసింది. ఈ క్రమంలో మావోయిస్టు ప్రభావం అంతగా లేని ప్రాంతాలను ఈ జాబితా నుంచి తొలగించారు. కేంద్ర హోంశాఖ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై విడుదల చేసిన జాబితా ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం కొన్ని జిల్లాల్లో పోలీసులకు స్పెషల్ అలవెన్స్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు..
కేంద్రం విడుదల చేసిన మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో తెలంగాణ నుంచి ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ జిల్లాలున్నాయి. కేంద్రం జాబితా అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం ఈ 8 జిల్లాలు మినహా ఇతర జిల్లాల పోలీసులకు 15 శాతం ప్రత్యేక అలవెన్స్‌ను పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ 8 జిల్లాల్లోనూ మావోయిస్టుల ప్రభావం తక్కువగా ఉన్న పీఎస్‌లకు అలవెన్స్ రద్దు చేశారు. పెద్దపల్లి జిల్లాలో మూడు( ముత్తారం, పొత్కపల్లి, మంథని) పోలీస్‌స్టేషన్లకు మాత్రమే స్పెషల్ అలవెన్స్ ఇవ్వనున్నారు.
పోలీసుల విషయంలోనే ఎందుకిలా ?
నక్సల్స్, మావోయిస్టుల ప్రభావం లేని ప్రాంతాల్లో పోలీసులకు ప్రత్యేక అలవెన్స్ రద్దు చేస్తున్నారు. అదే విధంగా ఆ ప్రాంతాలకు చెందిన రాజకీయ నాయకులకు, అధికారులకు మాత్రం ఎస్కార్ట్, గన్‌మెన్లు ఎందుకు ? అవి తొలగిస్తే సరిపోతుందని.. కేవలం పోలీసుల విషయంలోనే వివక్ష చూపిస్తున్నారనమే విమర్శలు మొదలయ్యాయి.