Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. ఆదివారం నాడు (జూలై 24) ఉదయం 6 గంటలకు ప్రారంభం కావాల్సిన మెట్రో సర్వీసులు గంట ఆలస్యంగా మొదలయ్యాయి. నాగోల్- రాయదుర్గం మార్గంలో మెట్రో రైళ్లు గంట ఆలస్యంగా ప్రారంభమై నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు చాలా సేపు వేచి ఉండి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొంత మంది స్టేషన్ నుంచి బయటకు వచ్చేసి బస్సులు, క్యాబ్‌లు, ఇతర ప్రైవేటు వాహనాల్లో గమ్యస్థానాలకు చేరుకున్నారు.
రెండు రోజుల క్రితం మెట్రో కార్డ్స్, టికెటింగ్ ఎంట్రీ మిషన్స్ పని చేయకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మెట్రోలో ఇటీవల తరచూ సాంకేతిక సమస్యలు వస్తుండటంతో ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతున్న సంగతి తెలిసిందే.
మరోవైపు, నిన్న మెట్రో స్టేషన్‌లో సర్వర్ సమస్య తలెత్తింది. ప్రయాణీకులకు టికెట్లు ఇచ్చే విషయంలో ఇబ్బందులు వచ్చాయి. టికెట్లు ఎవరికీ జారీ అవలేదు. దాదాపు అరగంట పాటు సమస్య ఏర్పడటంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓ పక్కన నగరంలో భారీ కురుస్తున్న వేళ ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు. ఎప్పుడు సమస్య కొలిక్కి వస్తుందో తెలియక ఇబ్బందులు పడ్డారు.
అంతకుముందు ఒకసారి, ముసారాంబాగ్ మెట్రో స్టేషన్ లో రైలు ఆగిపోయింది. తర్వాత నాంపల్లి మెట్రో స్టేషన్ ఘటనతో రైళ్ల రాకపోకలు తాత్కాలికంగా ఆగాయి. మిగతా కారిడార్లలోనూ మెట్రో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. మెట్రో స్టేషన్లలో భారీగా ప్రయాణికులు చేరడంతో ఆయా స్టేషన్లు రద్దీగా మారాయి. భవిష్యత్తులో సాంకేతిక సమస్యలు రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.