కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ స్కీంకు వ్యతిరేకంగా జరుగుతున్న అల్లర్లలో చనిపోయిన వారికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన అల్లర్లలో గాయపడిన వారిని రేవంత్‌ పరామర్శించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు ధైర్యం చెప్పారు. 


కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాలు కారణంగానే యువత రోడ్డుపైకి రావాల్సి వచ్చిందన్నారు రేవంత్ రెడ్డి. కాసులు మిగుల్చుకోవడానికే అగ్నిపథ్‌ తెరపైకి తీసుకొచ్చారని ఇది ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు రేవంత్. వాళ్ల చికిత్స అవసరమైన ఖర్చు మొత్తం కాంగ్రెస్ భరిస్తుందన్నారు. 


కేంద్రం లోపభూయిష్టమైన నిర్ణయం తీసుకుందని... దేశవ్యాప్తంగా వేల మంది విద్యార్థులు భవిష్యత్ చీకటిమయం అయిందన్నారు రేవంత్ రెడ్డి. తొందరపాటుతో ఓ విద్యార్థిని బలితీసుకున్నారన్నారు. రాజకీయాలు అపాదించి నికృష్ట బుద్ధి చూపిస్తున్నారని విమర్శించారు. 2020లో సెలెక్ట్ అయిన విద్యార్థులకు వెంటనే రాత పరీక్షలు నిర్వహించాలన్నారు. 


ఆందోళనల్లో పాల్గొన్న వారిని వచ్చే పరీక్షల్లో అనర్హులుగా ప్రకటించడం దారణమన్నారు రేవంత్ రెడ్డి. నిరసనల్లో పాల్గొన్న వారిపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా చేపట్టే ధర్నాల్లో తాము ప్రత్యక్షంగా పాల్గొంటామన్నారు రేవంత్ రెడ్డి. రేపు జంతర్‌మంతర్‌ వద్ద జరిగే దీక్షలో పాల్గొనబోతున్నట్టు ప్రకటించారు. విద్యార్థులకు అండగా కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. రిమాండ్‌లో ఉన్నవారికి కాంగ్రెస్ న్యాయ సహాయం అందిస్తుందన్నారు.






రాకేశ్‌ను టీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసి చంపేసిందన్నారు రేవంత్ రెడ్డి. రాకేశ్‌ అంతిమయాత్రలో పాల్గొనేందుకు వెళ్తున్న రేవంత్‌రెడ్డిని పోలీసులు ఘట్‌కేసర్‌ వద్ద అడ్డుకున్నారు. రాకేశ్ కుటుంబాన్ని పరామర్శిస్తే,,, వరంగల్‌ వెళ్తే పోలీసులకు వచ్చే ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. టీఆర్‌ఎస్‌ నేతలు వెళ్తే లేని తప్పు తాము వెళ్తే ఎందుకు సమస్య అవుతుందని నిలదీశారు రేవంత్.