దక్షిణ మధ్య రైల్వేకి రూ.3కోట్లకు పైగా నష్టం 
 
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అగ్నిపథ్ ఆందోళనల కారణంగా ఎంత నష్టం జరిగిందో దక్షిణ మధ్య రైల్వే లెక్క గట్టింది. ఈ వివరాలను లెక్కలతో సహా వెల్లడించింది. ఎంత నష్టం వాటిల్లిందో పరిశీలించగా..మొత్తం ఈ విలువ రూ. 3కోట్ల 29 లక్షల 97వేల 725 గా  తేలింది. ఈ విధ్వంసంలో ఎన్ని కోచ్‌లు ధ్వంసమయ్యాయి, ఎన్ని సీట్‌లు కాలిపోయాయో ఓ లిస్ట్ తయారు చేసి విడుదల చేసింది. ఎంతో విలువైన 109 స్మోక్ గ్లాస్‌లు పగిలిపోయిన కారణంగా రూ. 4 లక్షలు నష్టపోయింది దక్షిణ మధ్య రైల్వే. 400 విండో గ్లాస్‌లు ధ్వంసమైన కారణంగా రూ. 5 లక్షల నష్టం వాటిల్లింది. ఈ ఆందోళనల్లో రైళ్లకు నిప్పు పెట్టారు ఆందోళన కారులు. ఫలితంగా 150 బెర్త్‌లు పూర్తిగా  కాలిపోయాయి. ఒక్కో బెర్త్ విలువ రూ. 5 వేలు. ఇలా లెక్కకడితే కేవలం బెర్త్‌లు కాలిపోవటం వల్లే దక్షిణ మధ్య రైల్వేకి రూ. 7,50,000 నష్టం కలిగింది. ఓ ట్రైన్‌లో ఎస్‌ఎల్‌ఆర్‌ లగేజ్ పోర్షన్‌ పూర్తిగా కాలిపోవటం వల్ల రూ. 15 లక్షల నష్టం వాటిల్లింది. 


పూర్తిగా కాలిపోయిన 5 కోచ్‌లు..


జనరల్‌ సీటింగ్ కోచ్‌ పూర్తిగా కాలిపోవటం వల్ల అత్యధికంగా రూ. 30 లక్షలు నష్టపోక తప్పలేదు. మొత్తంగా 5 కోచ్‌లు కాలిపోగా, 30 ఏసీ కోచ్‌లు ధ్వంసమయ్యాయి. 47 నాన్‌ ఏసీ కోచెస్, ఓ ఎమ్‌ఎమ్‌టీఎస్ ఫుల్ రేక్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. బెడ్‌ షీట్లు, పిల్లో కవర్లు, ఫేస్ టవల్, బాత్ టవల్స్, ఇలా అన్నీ కలుపుకుని రూ. 3కోట్లకు పైగా ఆర్థిక నష్టం వాటిల్లిందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోనూ ఆర్మీ అభ్యర్థులు  శుక్రవారం
పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఆందోళనకారులు బీభత్సం సృష్టించటం వల్ల పోలీసులు రంగంలోకి దిగారు. అల్లర్లను కట్టడి చేసే ప్రయత్నం చేసినా అది సాధ్య పడలేదు ఫలితంగా టియర్ గ్యాస్ ప్రయోగించారు. అప్పటికీ ఆందోళనకారులు అల్లర్లు ఆపలేదు. పైగా పోలీసులపైకి రాళ్లు రువ్వారు. పరిస్థితులు చేయి దాటిపోవటం వల్ల పోలీసులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలోనే యువకులు ఒక్కసారిగా చెల్లాచెదురయ్యారు. ఈ తోపులాటలో పలువురు గాయపడ్డారు. ఈ కాల్పుల్లోనే ఒకరు మృతి చెందారు. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ అల్లర్లు జరిగే ప్రమాదముందని సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. విశాఖ, విజయవాడ, గుంటూరులో రైల్వే స్టేషన్‌లు, బస్‌ స్టేషన్లలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.