నా ఇంటికి రా.. ఇది నీ ఇల్లు భయ్యా..రాహుల్‌కు రేవంత్ ఆత్మీయ ఆహ్వానం.. అంటూ రేవంత్ రెడ్డి చేసిన ట్విట్ వైరల్ గా మారింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి పంపిన ఆత్మీయ ఆహ్వానం ప్రస్తుతం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ‘‘నా ఇంటికి రా.. ఇది నీ ఇల్లు భయ్యా’’ అంటూ రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీని ఢిల్లీలోని తన ఇంటికి ఆహ్వానించారు. ‘‘నా ఇల్లు నీ ఇల్లే... నా ఇంటికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. మనది ఒకటే కుటుంబం.. ఇది నీ ఇల్లే’’ అంటూ రాహుల్ గాంధీకి సోషల్ మీడియా వేదికగా సందేశాన్ని పంపించారు.
రాహుల్ గాంధీని లోక్‌సభ సభ్యుడిగా మోదీ ప్రభుత్వం ఆగమేఘాల మీద అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన అధికారిక నివాసం ఖాళీ చేయాలని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ఉద్వేగభరితంగా రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. నా ఇంటికి రా భయ్యా .. అంటూ రాహుల్ పై ఆప్యాయతను చాటుకుంటేనే రాహుత్ లో ఉన్న చొరవను తెలియజేప్పేలా ఉంది రేవంత్ ట్విట్.
ఇదిలా ఉంటే మరోవైపు రాహుల్ గాంధీపై వేటు మొదలు ఢిల్లీలోని అధికారిక నివాసం ఖాళీ చేయించే వరకు జరుగుతున్న పరిణామాలపై ఆ పార్టీ సీనియర్ నేతలు తమదైన శైలిలో కేంద్రంలోని బిజెపిపై విరుచుకుపడుతున్నారు. రాహుల్ అధికారిక నివాసాన్ని ఖాళీ చేయమని చెప్పడం వ్యక్తిగతంగా రాహుల్ ను దెబ్బకొట్టే ప్రయత్నమేననన్నారు ఆపార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే. ఇంటిని ఖాళీ చేస్తే నా దగ్గరకు వచ్చి ఇక్కడే ఉంటారు లేదా తన తల్లి సోనియాగాంధీ వద్దకు వెళ్తారు.. ఎప్పుడు నా ఇంటికి వచ్చినా రాహుల్ కు నా ఇంట్లో చోటు ఉంటుందని అన్నారు. కానీ ఇలా అధికారిక నివాసం ఖాళీ చేయాలంటూ బెదిరించడం ,అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. మొదట్లో మూడు నెలల పాటు అధికారిక నివాసం కేటాయించలేదని ఆరోపించారు. ఇలాంటి చర్యల వల్ల ఎదుటి వ్యక్తులను అవమానించాలని ప్రయత్నించడం సరికాదన్నారు ఖార్గే.
రాహుల్ గాంధీ 2004లో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి మొదటిసారి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించగా.. ఢిల్లీలో 12 తుగ్లక్ లేన్ లో ఎంపీగా అధికారిక నివాసం కేటాయించారు. ఆ తరువాత 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీలో ఓడిపోయినా, కేరళలోని వయనాడ్ నుంచి గెలుపొందారు. దాంతో ఆయనకు అధికారిక నివాసాన్ని అలాగే కొనసాగించారు. రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ ఏంపిగా ఓడిపోవడంతో ఆ బంగ్లాను ఖాళీ చేయాలని 2020లో ఆమెకు కేంద్రం సూచించింది. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ పరువునష్టం కేసులో రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో రాహుల్ కు లోక్ సభ సభ్యత్వం రద్దు చేయడంతోపాటు ఏప్రిల్ 22వ తేదిలోపు ఢిల్లీలోని తుగ్లక్ లేన్ 12 లో ఉన్న అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలంటూ లోక్ సభ హౌసింగ్ కమీటీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈనేపధ్యంలో ఆ పార్టీ నేతలు రాహుల్ కు తమదైన శైలిలో మద్దతు తెలుపుతున్నారు.