హైదరాబాద్: తెలంగాణలో గత కొన్ని రోజుల నుంచి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పలుచోట్ల కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఉస్మానియా ఆసుపత్రిలో ఓ పేషెంట్ కోవిడ్ బారిన పడి చనిపోయాడని ప్రచారం జరిగింది. ఉస్మానియాలో కరోనాతో ఓ వ్యక్తి చనిపోయాడనేది నిజం కాదని హాస్పిటల్ సూపరింటెండెంట్ తెలిపారు. అవన్నీ వదంతులేనని కొట్టిపారేశారు. అసలేం జరిగిందో వివరించారు.  


ఉస్మానియాలో పేషెంట్ కోవిడ్ కారణంగా చనిపోలేదు.. ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లో కోవిడ్19 కు చికిత్స పొందుతూ ఓ పేషెంట్ చనిపోయాడని మీడియాలో వార్తలు వస్తున్నాయని, ఇది సరికాదన్నారు. నగరంలోన బండ్లగూడ, దూద్‌బౌలికి చెందిన 60 ఏళ్ల పేషెంట్ మహ్మద్ సుభాన్ అనారోగ్యంతో ఉస్మానియా ఆసుపత్రిలో చేరారు. ఆయనకు ఎడమ జఠరిక పనిచేయకపోవడం (గుండె ఆగిపోవడం), టైప్ 2 శ్వాసకోశ వైఫల్యంతో మెడికల్ ఎమర్జెన్సీతో అక్యూట్ మెడికల్ కేర్‌లో చేరారని సూపరింటెండెంట్ తెలిపారు. గుండె సంబంధిత సమస్యతో చికిత్స పొందుతూ ఆ పేషెంట్ డిసెంబర్ 24న చనిపోయారు. అయితే పేషెంట్ కు యాదృచ్ఛికంగా నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చిందని వెల్లడించారు. గుండె సమస్యతో చనిపోతే, కరోనా కారణంగా మరణించారని జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.
 
ఉస్మానియాలో ప్రస్తుతం ముగ్గురు పేషెంట్లు ఐసోలేషన్ వార్డులో పలు అత్యవసర పరిస్థితులతో అడ్మిట్‌ అయ్యారు. వారికి పరీక్ష చేయగా కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరి ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. అయితే ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో నమోదవుతున్న కోవిడ్ JN1 పై అంత భయపడాల్సిన పనిలేదన్నారు. కరోనా పాజిటివ్ గా నిర్ధారితమైన వారిని ఒంటరిగా ఉంచి, అవసరమైన అన్ని చికిత్సలు అందించాలని వైద్యులకు సూచించారు. 


ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో 9 కేసులు హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చినవే. మరొకటి కరీంనగర్‌లో వెలుగు చూసింది. 24 గంటల్లో వైరస్ బారిన పడి ఒకరు కోలుకున్నారు. 55 మంది ఐసోలేషన్‌లో ఉన్నారని పేర్కొంది ప్రభుత్వం. ఇంకా 12 మంది రిపోర్టు రావాల్సి ఉందని తెలిపింది. అయితే ఇప్పటి వరకు కొత్త వేరియంట్‌ జేఎన్‌-1 కేసులు నమోదు కాలేదని మాత్రం అధికారులు గట్టిగా చెబుతున్నారు.