eChallan Discounts in Telangana: డిస్కౌంట్ పై ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ జీవోలో పేర్కొన్న వివరాల ప్రకారం.. టూవీలర్స్ పై 80 శాతం, త్రీ వీలర్స్ పై 90 శాతం, కార్లపై ఉన్న చలాన్ల విషయంలో 50 శాతం రాయితీ ప్రకటించారు.  ఈ మేరకు రవాణా శాఖ కార్యదర్శి  జీవో జారీ చేశారు.


ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడడం వల్ల పోలీసులు వేసిన చలాన్లు పేరుకుపోయిన వారికి పోలీసులు ఓ సదావకాశాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. చలాన్ల చెల్లింపు చేస్తే భారీ డిస్కౌంట్ ఉంటుందని పోలీసులు ప్రకటించారు. దీంతో తమ వాహనాలపై పెండింగ్ లో ఉన్న చలాన్లను కట్టేందుకు జనం ఎగబడడంతో ట్రాఫిక్ చలాన్ల (eChallan Discounts) సైట్ కాస్త నిలిచిపోయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేటి (డిసెంబర్ 26) నుంచి జనవరి 10వ తేదీ వరకు పెండింగ్‌ చలాన్లను రాయితీతో చెల్లించొచ్చని అవకాశం కల్పించింది. కానీ, వాహనదారులు తొలిరోజే చలాన్లు కట్టడానికి ఎగబడడంతో సైట్ పై ట్రాఫిక్ ఒత్తిడి పెరిగిపోయి క్రాష్ అయింది. దీంతో వాహనదారులు అయోమయానికి గురవుతున్నారు. 


డిస్కౌంట్ల ద్వారా పెండింగ్ చలాన్ల (eChallan Discounts) బకాయిలు క్లియర్ అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా భారీ ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేశారు. అదీకాక వాహనదారులకు జరిమానాల భారం కూడా తగ్గుతుంది. ఈ క్రమంలోనే నేడు ఉదయం నుంచే ట్రాఫిక్ చలాన్లు కట్టేందుకు వాహనదారులు ఈచలాన్ వెబ్ సైట్ ఓపెన్ చేసి.. తమ చలాన్లు క్లియర్ చేసుకొనేందుకు ప్రయత్నించారు. దీంతో ఈ చలాన్ వెబ్‌సైట్ లో వెహికల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత డీటెయిల్స్ చూపించడం లేదు. దీంతో వినియోగదారులు పదే పదే రీఫ్రెష్ చేస్తూ అయోమయానికి గురవుతున్నారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని ట్రాఫిక్ పోలీసులకు వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.


డిస్కౌంట్ ఎంతంటే..


న్యూ ఇయర్‌ వేళ పోలీసులు వాహనదారులకు ఈ కానుక ఇచ్చినట్లు అయింది. పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్ల (Pending eChallans) చెల్లింపుపై భారీ డిస్కౌంట్ లో భాగంగా బైక్‌లు, స్కూటర్లపై 80 శాతం, ఆటోల చలాన్ల విషయంలో 80 శాతం డిస్కౌంట్ ఇచ్చారు. కార్లు, ట్రక్కులు, ఇతర భారీ వాహనాలపై పెండింగ్‌ చలాన్ల విషయంలో 50 శాతం రాయితీ కల్పించారు. ఆర్టీసీ డ్రైవర్లకు, తోపుడు బండ్ల వారికి 90 శాతం రాయితీని ప్రకటించారు. ట్రాఫిక్‌ చలాన్ల చెల్లింపులో రాయితీలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఓకే అనడంతో పోలీస్‌ అధికారులు ఈ ఆదేశాలు జారీ చేశారు. వాహనదారులు https://echallan.tspolice.gov.in/publicview/ వెబ్‌సైట్‌లో వాహనదారులు ఈ నెల 26 నుంచి జనవరి 10 వరకు ఆన్‌ లైన్‌లో పెండింగ్‌ చలాన్లను రాయితీపై చెల్లించవచ్చని అధికారులు వెల్లడించారు.