CSK Team For Adudam Andhra: ఆడుదాం ఆంధ్రా పోటీలను అట్టహాసంగా ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం అందులో నైపుణ్యమైన క్రీడాకారులను వెలికి తీసే పనిలో పడింది. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్‌ లాంటి వారితో మాట్లాడి వారిలో కొందరు క్రీడాకారులను ఈ పోటీలకు తరలి వచ్చేలా ఈవెంట్ ప్లాన్ చేస్తోంది. 


వివిధ దశల్లో పోటీలు 


ఆడుదాం ఆంధ్రా పోటీలు వివిధ దశల్లో జరగనున్నాయి. ముందు గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో పోటీలులు సాగుతాయి. అక్కడ విజయం సాధించిన వారిని మండల స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. వివిధ గ్రామాలు, వార్డుల్లో విజేతలుగా నిలిచిన వారు ఇక్కడ పోటీ పడతారు. అలా మండల స్థాయిలో పోటి పడిన వారంతా నియోజకవర్గ స్థాయిలో తలపడనున్నారు. 


నియోజకవర్గ పోటీల కోసం చెన్నై సూపర్ కింగ్స్


నియోజకవర్గ స్థాయిలో జరిగే పోటీలు చూసేందుకు జాతీస్థాయిలో పేరున్న క్రీడా సంస్థలు రానున్నాయి. క్రికెట్‌ విషయానికి వస్తే చెన్నై సూపర్ కింగ్స్‌లోని క్రీడాకారులు తరలి రానున్నారు. ఇక్కడ నైపుణ్యం ఉన్న ఆటగాళ్ల ప్రతిభను పరిశీలించనున్నారు. ఇందులో ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ కూడా నియోజకవర్గ స్థాయిలో జరిగే పోటీలను పరిశీలించనుంది. 


బ్యాడ్మింటన్‌ కోసం సింధు, శ్రీకాంత్


బ్యాడ్మింటన్‌ క్రీడలను సింధు, శ్రీకాంత్ పరిశీలిస్తారు. వీళ్లు కూడా ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి వారిని సానబెట్టనున్నారు. ఇలా అన్ని క్రీడల్లో కూడా ప్రముఖులు వచ్చి నియోజకవర్గాల్లో జరిగే పోటీలను పరిశీలిస్తారు. మంచి ప్రతిభ ఉన్న క్రీడాకారులను వెతికి వారి నైపుణ్యాన్ని మరింత మెరుగులు దిద్దేందుకు సహాయపడతారని సీఎం జగన్ గుంటూరులో చెప్పారు.