Foxconn Representatives meets Revanth Reddy: ప్రపంచంలోనే ప్రముఖ సంస్థ అయిన ఫాక్స్‌కాన్ సంస్థ తెలంగాణ‌లో పెట్టబోతున్న పరిశ్రమలు, ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సంస్థ ప్రతినిధులు కలిశారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో వీరి భేటీ జరిగింది. తెలంగాణలో ఫాక్స్‌కాన్ ఏర్పాటు చేయబోయే భ‌విష్యత్తు ప్రాజెక్టుల‌కు కావాల్సిన పూర్తి సహకారం తాము అందిస్తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొంగ‌ర‌క‌లాన్ నెలకొల్పబోతున్న ఉత్పాద‌క కేంద్రానికి కూడా మద్దతు అందిస్తామని చెప్పారు. తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధి జరగడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ప్రజల ఆకాంక్షలను కాపాడే బాధ్యత కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని.. అన్ని వర్గాలకు స్నేహపూర్వకంగా ఉండే విధానాన్ని తాము అనుసరిస్తున్నామని అన్నారు.


తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అభివృద్ధిని ప్రభుత్వం ఇంకా వేగవంతం చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పరిశ్రమల ఏర్పాటు, వాటి విస్తరణకు కావాల్సిన అనుమతులను సులభంగా అందించడంతోపాటు, మౌలిక సదుపాయాలను కూడా ప్రభుత్వం కల్పిస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా దేశంలోనే అగ్రగామిగా ఉంచేందుకు విధానపరంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలను తీసుకుంటామని అన్నారు. 


2023 ఏడాది మార్చిలో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫాక్స్ కాన్ తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫాక్స్‌కాన్ సంస్థ ఎలక్ట్రానిక్స్ డివైజ్‌లు, ఉపకరణాలు తయారు చేస్తామని, సదరు కర్మాగారాలను ఏర్పాటు చేయడం ద్వారా వాటిలో ఒక లక్ష ఉద్యోగాలను కల్పిస్తామనే హామీతో తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మొదటి దశలో, వచ్చే రెండేళ్లలో 25 వేల ఉద్యోగాలు ఈ సంస్థ కల్పించనుంది.


ఫాక్స్‌కాన్ సంస్థ యాపిల్ ఐ ఫోన్లను తయారుచేస్తుంటుంది. ఫాక్స్‌కాన్‌ ప్రధాన క్లైంట్స్ లో గూగుల్, షియోమి, అమెజాన్, అలీబాబా గ్రూప్, సీస్కో, డెల్, ఫేస్‌బుక్‌, సోని, మైక్రోసాఫ్ట్, నోకియా వంటి దిగ్గజ సంస్థలు ఉన్నాయి. చైనా, వియత్నాం, థాయ్‌లాండ్, మలేషియా, అమెరికా, యూరప్, భారత్ సహా 24 దేశాలలో ఫాక్సాకాన్ సంస్థ కార్యకలాపాలు సాగిస్తుంది. మన దేశంలో ఏపీ (శ్రీ సిటి), తమిళనాడు (శ్రీ పెరంబుదూర్), తెలంగాణ (కొంగర కలాన్), కర్ణాటకలో (బెంగళూరు) సంస్థకు కర్మాగారాలు ఉన్నాయి.


ఫాక్స్‌కాన్‌ కంపెనీకి కేంద్రం నుంచి 50 శాతం, తెలంగాణ ప్రభుత్వం నుంచి 25 నుంచి 30 శాతం వరకు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు మొదలైన పొరుగు రాష్ట్రాలు కూడా ఇలాంటి ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. అయితే ఇందులో 10 శాతం ఈక్విటీని రాష్ట్రం తీసుకోనుంది.