Telangana News: తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3 కోట్ల 6 లక్షల 42 వేల 333కు చేరుకుంది. ఇందులో ఒక కోటి 53 లక్షల 73 వేల 66 మంది పురుషులు ఉండగా..  కోటి 52 లక్షల 51 వేల 797 మంది మహి­ళ­లు ఉన్నారు. అలాగే 2,133 మంది థర్డ్‌ జెండర్‌ల ఓటర్లు ఉన్నారు. త్వరలో రాబోతున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల టైంలో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక రెండో సవరణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రా­జ్‌ ఈ వివరాలను ప్రకటించారు. రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజక వర్గాల ముసాయిదా ఓటర్ల జాబితాలను సిద్ధం చేసి సోమవారం తెలిపారు. ముసాయిదా జాబితాపై అభ్యం­తరాలు, కొత్తగా ఓటర్ల నమోదుకు దరఖాస్తుల స్వీకరణకు సెప్టెంబర్‌ 19 వరకు గడువు ఉందని వెల్లడించారు. సెప్టెంబర్‌ 28వ తేదీ వరకు అభ్యంతరా­లు, దరఖాస్తులను పరిష్కరించి అక్టోబర్‌ 4న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. త్వరలో జరగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఈ ఓటర్ల జాబితానే వినియోగించనున్నారు. 


రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 35,356 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా, ముసాయిదా జాబితాలో 3 కోట్ల 6 లక్షల 26 వేల 996 మంది సాధారణ ఓటర్లు ఉన్నారు. 2,742 మంది ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు, 15,337 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. 4 లక్షల 76 వేల 597 మంది 18 నుంచి 19 ఏళ్ల వయస్సు కలిగిన యువ ఓటర్ల ఉన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం 2023లో భాగంగా గత జనవరి 5న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో మొత్తం 2,99,77,659 మంది ఓటర్లు ఉండగా, ఓటర్ల జాబితా నిరంతర నవీకరణలో భాగంగా ఇప్పటి వరకు మొత్తం 8,31,520 మంది ఓటర్లను నమోదు చేశారు. లక్షా 82 వేల 183 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. ముసాయిదా జాబితాలో అనుకోకుండా ఎవరి పేరును అయినా తప్పుగా తొలగిస్తే.. బాధిత ఓటర్లు 15 రోజుల గడువులోగా జిల్లా ఎన్నికల అధికారికి అప్పీ­ల్‌ చేసుకోవాలని సూచించారు. లేకపోతే మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుందని.. ఇలా చేసుకోవడానికి ఫారం–6 ద్వారా అప్లై చేసుకోవాలని సూచించారు. 


‘ఓటర్ల’ అధికారుల బదిలీలపై నిషేధం


రాష్ట్రంలో ఓటర్ల జాబితా తయారు చేయడంలో పాలు పంచుకుంటున్న అధికారుల బదిలీలపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఓటర్ల జాబితా సవరణలో కీలకమైన జిల్లా ఎన్నికల అధికారులు, ఉప జిల్లా ఎన్నికల అధికారులు, ఓటర్ల నమోదు అధికారులు, సహాయ ఓటర్ల నమోదు అధికారులు తదితర స్థాయి అధికారుల బదిలీలపై ఈ నెల 21వ తేదీ నుంచి అక్టోబర్‌ 4వ తేదీ వరకు నిషేధం అమల్లో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీఈఓ వికాస్‌ రాజ్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఓటర్ల జాబితా తయారీ బాధ్యతల్లోని అధికారులను బదిలీ చేస్తే జాబితా నాణ్యతపై ప్రభావం పడుతుందని స్పష్టం చేశారు. ఒకవేళ అత్యవసరంగా ఎవరైనా అధికారిని బదిలీ చేయాల్సి వస్తే స్పష్టమైన వివరాలు అందజేసి ఎన్నికల సంఘం నుంచి అనుమతి పొందాలని వివరించారు. జిల్లా ఎన్నికల అధికారి నుంచి బూత్‌ లెవల్‌ అధికారుల (బీఎల్‌ఓ) వరకు బదిలీలు, పోస్టింగ్‌ల విషయంలో ఈ నిబంధన లు వర్తిస్తాయని అన్నారు. ఎక్కువ రోజులు సెలవులు తీసుకోవడానికి ముందు ఎన్నికల సంఘం నుంచి అనుమతి పొందాలని అధికారులను సూచించారు. రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగిందని తెలిపారు. 64 అసెంబ్లీ నియోజక వర్గాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారని.. ఆయా నియోజక వర్గాల్లో పురుషుల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువగా నమోదు కావటం నిజంగా సంతోషకరం అన్నారు.